Minister KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు గ్రాండ్ గా నిర్వహించారు. అయితే పుట్టిన రోజు వేడుకలకు కేటీఆర్ దూరంగా ఉన్నారు. ఇటీవల వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. అయితే ఓ మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం చూపించారు. ఇప్పుడు సస్పెండ్ అయ్యారు.
మున్సిపల్ కమిషనర్ సస్పెండ్
బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ ఈ నెల 24న మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆ వేడుకలకు హాజరు కాలేదని నలుగురి సిబ్బందికి మెమో జారీ చేశారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయం మంత్రి కేటీఆర్ వరకూ చేరింది. దీంతో మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని మంత్రి కేటీఆర్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రాజకీయాలు, పరిపాలనలో సైకోఫ్యాన్సీని ప్రోత్సహించడంలో తాను చివరి వ్యక్తినని కేటీఆర్ తెలిపారు.
వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ కాలికి ఇటీవల గాయమయ్యింది. ప్రమాదవశాత్తు జారీ పడడంతో ఎడమకాలి మడమ చీలమండలంలో క్రాక్ వచ్చిందని మంత్రి ట్వీట్ చేశారు. వైద్యుల సూచనతో మూడు వారాలు విశ్రాంతి తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. అప్పటి నుంచి మంత్రి కేటీఆర్ వర్క్ ఫ్రమ్ హోం చేస్తు్న్నారు. పెండింగ్ ఫైళ్లు, మున్సిపల్ శాఖకు సంబంధించిన పనులను చూస్తున్నారు. మూడు వారాల రెస్ట్ లో చూడాల్సిన ఓటీటీల్లో ఏమైనా మంచి సినిమాలు సజెస్ట్ చేయమని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడంతో మరో ట్వీట్ తో విమర్శలకు చెక్ పెట్టారు కేటీఆర్. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్న ఫొటో ఒకటి ట్వీట్ చేశారు.