Minister KTR: ఉన్నత విద్యను అభ్యసించిన వారు, ఐటీ ఉద్యోగులు సైబర్ నేరాలకు గురవడం నిజంగా బాధాకరం అని మంత్రి కేటీఆర్ అన్నారు. అవగాహన లోపం వల్లే సైబర్ నేరహాళ్ల చేతిలో మోసపోతున్నారని తెలిపారు. సైబరాబాద్ లో తెలంగాణ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు మహమూద్ అలీ ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు, వేగంగా దర్యాప్తు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇది ఉపయోగపడనుంది. మైక్రో సాఫ్ట్, ఐఐటీ హైదరాబాద్, సియంట్ సంస్థల సహకారంతో పోలీసులు ఏర్పాటు చేసిన ఈ సెంటర్ దేశంలోనే మొట్ట మొదటిది కావడం గమనార్హం.
అయితే ప్రస్తుత కాలంలో మొత్తం ఇంటర్నెట్ తో సాగుతుందని మంత్రి కేటీర్ అన్నారు. ప్రతి వస్తువు వైఫైతో పని చేస్తుందని తెలిపారు. ఇలాంటి సమయంలో సైబర్ భద్రత చాలా పెద్ద ఛాలెంజ్ అని చెప్పుకొచ్చారు. అలాగే సైబర్ నేరాలకు గురైన వారు 1930 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ విషయం ప్రజల్లోకి ఇంకా వెళ్లట్లేదని అన్నారు. సైబర్ నేరాలను అరికట్టడానికి తెలంగాణ పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. నేరాలను అరికట్టడానికి కేవలం పోలీసులే కాకుండా.. ఇతర కంపెనీలు కూడా సామాజిక బాధ్యత తీసుకోవాలన్నారు. హైదరాబాద్ లో లక్ష మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారని చెప్పుకొచ్చారు. నేరాల బారిన పడుతున్న వారిలో చదువుకున్న వారు, ఐటీ ఉద్యోగులు ఉండడం బాధాకరం అని అన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలను అమలు చేస్తామన్నారు.
మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితుల జాబితా రూపొందించాలని.. ఇందుకోసం ఓ ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించి అందులో నిందితుల జాబితా ఉంచాలని మంత్రి కేటీఆర్ వివరించారు. అలాగే మహిళలు, బాలికల సేఫ్టీ కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. వీలయినంత వరకు ఎలాంటి అత్యాచారాలు జరగకుండా చూడాలని.. అమ్మాయిలు కూడా ఏదైనా సమస్య వచ్చినట్లు, ఎవరి మీద అయినా అనుమానం వస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్లు, షీ టీంలకు ఫోన్ చేయాలని సూచించారు.