తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరో ఘనత సాధించారు. ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) కు సంబంధించి ప్రపంచంలోనే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ టాప్ లిస్టులో చోటు సాధించి సత్తా చాటారు. ప్రపంచంలోనే టాప్ 30 జాబితాలో మంత్రి కేటీఆర్ కు స్థానం దక్కింది. మొత్తం భారతదేశం నుంచి ఇద్దరు యువ నేతలకు మాత్రమే ఈ టాప్ 30 జాబితాలో చోటు దక్కడం విశేషం. అందులో ఒకరు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కాగా మరొకరు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ ఛడ్డా. ఈ ఇద్దరిలోనూ టాప్ 30 లిస్టులో మంత్రి కేటీఆరే ముందంజలో ఉన్నారు.


ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణ ఐటీ పురోభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సామాన్యుల సమస్యలకు సైతం స్పందిస్తూ వారికి భరోసా కల్పిస్తుంటారు. ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకం అవుతూ సమస్యల పరిష్కారానికి శ్రమిస్తూ ఉంటారు. అటు అఫిషియల్, ఇటు పర్సనల్ అకౌంట్ ఇలా రెండింటిలోనూ మంత్రి కేటీఆర్ అగ్రస్థానంలో నిలిచారు. టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్ కు చోటు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మంత్రి కేటీఆర్ పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న కేటీఆర్ కు ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలంతా అభినందనలు తెలుపుతున్నారు.


ఈ టాప్ 30 లిస్టులో మంత్రి కేటీఆర్ 12వ స్థానంలో నిలవడగా, ఆయన శాఖ మినిస్టర్ ఫర్ ఐటీ, ఇండస్ట్రీస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్ మెంట్ అనే ట్విటర్ ఖాతా 22వ స్థానంలో నిలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ ఛడ్డా 23వ స్థానంలో నిలిచారు.


మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌లో 3.8 మిలియన్ ఫాలోవర్లు ఉండగా, ఆయన అధికారిక ఖాతాకు 9.77 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.