KTR TODAY : దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కేటీఆర్ ..  సద్గురు జగ్గీ వాసుదేవ్ తో సంభాషణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ ( save soil )పేరుతో  అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు సద్గురు.  రెండు రోజులపాటు దావోస్లో ప్రపంచ స్థాయి కంపెనీలను కలిసి తన కార్యక్రమంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  ప్రభుత్వాధినేతలు, కార్పొరేట్ కంపెనీలతో   తెలంగాణ పెవిలియన్ లో  సద్గురు సంభాషించారు. ఈ సందర్భంగా తాను  చేపట్టిన సేవ్ సాయిల్ కార్యక్రమం గురించి సద్గురు మాట్లాడారు. రానున్న 2, 3 దశాబ్దాల్లో ని ప్రపంచంలోని వ్యవసాయ యోగ్యమైన నేలలు అంతరించి పోయే ప్రమాదం ఉందని, ఇప్పటినుంచి భూమిని పంటల కు అనుగుణంగా సారవంతం చేసే కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భూమి సారాన్ని కోల్పోతుందని, త్వరలోనే ఈ సమస్య వలన ఆహార కొరతను ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా సద్గురు తెలిపారు. పర్యావరణ అనుకూల కార్యక్రమాలను అన్ని ప్రభుత్వాలు అత్యంత వేగంగా శ్రీకారం చుట్టాలసిన అవసరం ఉందన్నారు. 


ఈ సందర్భంగా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మానవ ప్రయత్నం ఆయన హరితహారం కార్యక్రమం గురించి కేటీఆర్ సద్గురుకు తెలిపారు.  తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అనేకమైన విప్లవాత్మకమైన మార్పులను, మద్దతు కార్యక్రమాలను తీసుకువచ్చి, వ్యవసాయోత్పత్తుల పెంపుకు చేస్తున్న కృషిని వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణం, రైతులను సంఘటిత పరచడం, వ్యవసాయ విస్తరణ అధికారులు నియామకం, వ్యవసాయరంగానికి ఇస్తున్న రైతు బంధు రైతు భీమా వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు.   సద్గురు చేపట్టిన సేవ్ సాయిల్ ర్యాలి అద్భుతమైన కార్యక్రమమన్న కేటీఆర్  సద్గురును హైదరాబాద్‌కు  ఆహ్వానించారు. 


తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకు వచ్చిన కార్యక్రమాల పై సద్గురు ప్రశంసలు కురిపించారు.  తమ సంస్థ ద్వారా వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం పెంపుకు చేపట్టిన కార్యక్రమాల పైన తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 




తెలంగాణ పెవిలియన్‌లోనే మంత్రి కేటీఆర్‌ను మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే  కలిశారు. తెలంగాణ, మహారాష్ట్ర కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మాలాంటి రంగాల్లో సాధిస్తున్న పురోగతి పైన చేపట్టిన కార్యక్రమాలపై ఆదిత్య థాకరే ఆసక్తి చూపించారు. తెలంగాణ స‌ర్కారు పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన హరితహారం, మున్సిపల్, పంచాయతీ చట్టాల్లో 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించడంలాంటి కీలకమైన సంస్కరణలను ఆదిత్య థాకరేకు కేటీఆర్‌ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలపై మరింత అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ వస్తానని ఆదిత్య థాకరే తెలిపారు.