Jahnavi Death: అమెరికాలోని సియాటెల్‌లో భారతీయ విద్యార్థిని కందుల జాహ్నవి మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన ఆమె రోడ్డు దాటుతుండగా పోలీస్ ప్యాట్రోల్ వెహికిల్ ఢీకొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై ఇద్దరు పోలీసులు జోక్ చేసుకోవడం...ఆ వీడియో బయటకు రావడం మరింత అలజడి రేపింది. ఈ ఘటనపై తాజాగా తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. అమెరికా పోలీసులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పోలీసు అధికారి నిర్ద్వంద వ్యాఖ్యలకు తీవ్రంగా కలత చెందినట్లు వెల్లడించారు.


భారత్ లోని అమెరికా రాయబారి యూఎస్ ప్రభుత్వ అధికారులను సంప్రదించి జాహ్నవి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. అలాగే ఈ కేసుపై స్వతంత్ర దర్యాప్తు జరిపేలా డిమాండ్ చేయాలని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ ను కూడా అభ్యర్థిస్తున్నట్లు ఎక్స్ ద్వారా వెల్లడించారు. అలాగే ఎన్నో ఆశయాలతో ఉన్న ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోవడం విషాధకరం. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఆపాదించడం మరింత దిగ్భ్రాంతి కల్గిస్తోందని మంత్రి కేటీఆర్ వివరించారు. 






ఈ ఘటనపై భారత్‌ సీరియస్ అయింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని Consulate General of India తీవ్రంగా స్పందించింది. ఇది చాలా దారుణం అంటూ మండి పడింది. సియాటెల్‌లోని స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించింది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చొరవ చూపిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ట్విటర్ అఫీషియల్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తామని హామీ ఇచ్చింది. 


"ఈ ఘటన చాలా దారుణం. సియాటెల్‌తో పాటు వాషింగ్టన్ స్టేట్‌లోని అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం. పారదర్శకంగా విచారణ జరపాలని డిమాండ్ చేశాం. జాహ్నవి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పాం. కాన్సులేట్, ఎంబసీ అధికారులతో విచారణపై ఆరా తీస్తున్నాం" - కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, శాన్‌ ఫ్రాన్సిస్కో