Warner Bros. Discovery: ప్రస్తుతం న్యూయార్క్‌ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ (KTR) వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. నేడు (మే 17) వార్నర్ బ్రదర్స్ డిస్కవ‌రీ (Warner Bros. Discovery) ప్రతినిధులతో భేటీ అయ్యారు. టెలివిజన్, చలనచిత్రం, స్ట్రీమింగ్, గేమింగ్‌ రంగాల్లో విభిన్నమైన కంటెంట్, బ్రాండ్‌లు, ఫ్రాంచైజీల పోర్ట్‌ఫోలియోకు ప్రసిద్ధి చెందిన గ్లోబల్ మీడియా సంస్థ అయిన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తెలంగాణ వినోద రంగంలోకి ప్రవేశించనుందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ మేర‌కు వార్నర్ బ్రద‌ర్స్ డిస్కవ‌రీ సంస్థ కూడా అధికారికంగా ప్రక‌టించింది.


ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వార్నర్ బ్రద‌ర్స్ డిస్కవ‌రీ తెలంగాణ వినోద రంగంలోకి ప్రవేశిస్తోంది. తెలంగాణ వినోద రంగంలోకి డిస్కవ‌రీ రావ‌డం సంతోష‌క‌రం అని అన్నారు. క్రియేటివిటీ, ఇన్నోవేష‌న్ హ‌బ్‌గా ఐడీసీ (అంత‌ర్జాతీయ అభివృద్ధి కేంద్రం)ని డిస్కవ‌రీ ఏర్పాటు చేస్తుంద‌ని అన్నారు. మొద‌టి ఏడాదిలోనే 1200 మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని కేటీఆర్ తెలిపారు.


‘‘గ్లోబల్ మీడియా పవర్ హౌస్ అయిన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ తెలంగాణ ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. వారి క్రియేటివిటీ, ఇన్నోవేషన్ తో కూడిన ఇంటర్నేషనల్ డెవలప్ సెంటర్ ను హైదరాబాద్‌లో నెలకొల్పనున్నారు. తద్వారా వీరు నెలకొల్పిన మొదటి ఏడాదిలోనే 1200 ఉద్యోగాలు కల్పించనున్నారు. వారి విస్తరణ ప్రణాళికల్లో ఇదొక మైలురాయిగా చెప్పవచ్చు.


వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ అనేది ప్రీమియర్ గ్లోబల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ. ఇది టెలివిజన్, ఫిల్మ్, స్ట్రీమింగ్, గేమింగ్, బ్రాండ్స్, ఫ్రాంచైజీస్ విభాగాల్లో ప్రపంచంలోనే భిన్నమైన కంటెంట్‌ను ఇది ఆడియన్స్ కి అందిస్తోంది. 


వీరి పోర్ట్‌ఫోలియోలో హెచ్‌బీఓ, సీఎన్ఎన్, టీఎల్‌సీ, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్ల్యూబీ, యూరోస్పోర్ట్, యానిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్‌వర్క్, సినీమ్యాక్స్, హెచ్‌జీటీవీ, క్వెస్ట్ వంటి ఛానెళ్లు ఉన్నాయి. ఇలాంటి పరిశ్రమ దిగ్గజాలతో కలిసి పని చేయడం వల్ల తెలంగాణలో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగం భవిష్యత్తును రూపొందించే అద్భుతమైన వెంచర్‌లకు హామీ లభిస్తుంది’’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.