విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లుగా మంత్రి, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. కేంద్రం ఓ నియంతలా, అప్రజాస్వామికంగా వ్యవహరించడమే తమ నిర్ణయానికి కారణమని వివరించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మోదీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూలదోసి, మెజారిటీ లేకపోయినా అడ్డదారిలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు. రాజ్యాంగబద్ధ సంస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకొని, విపక్షాలపై వేట కుక్కల్లాగా వాటిని ఉసిగొల్పి, రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుతున్నారని ధ్వజమెత్తారు. అందుకే బీజేపీ మద్దతిస్తున్న అభ్యర్థిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నామని అన్నారు. ఢిల్లీలో యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 


అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాలరాసి మోదీ రాజ్యాంగం అమలవుతోందని, అందుకే బీజేపీ ప్రతిపాదిస్తున్న అభ్యర్థిని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. విపక్షాలు బలపర్చుతున్న అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని వివరించారు. ఇతర పార్టీల వారు కూడా ఈ విషయం గుర్తించాలని, ఆయన్ను రాష్ట్రపతిగా గెలిపించాలని అన్నారు.


ద్రౌపదిపై మాకు వ్యక్తిగత వ్యతిరేకత లేదు, కానీ.. - కేటీఆర్


‘‘ద్రౌపది ముర్ముపై వ్యక్తిగతంగా మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. 2006లో ఒడిశాలోని కళింగ నగర్‌లో స్టీల్ ప్లాంటుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న 13 మంది గిరిజనులను కాల్చి చంపారు. బీజేపీ మద్దతిస్తున్న ద్రౌపది ముర్ము అప్పుడు రాష్ట్ర మంత్రి. గిరిజనులు చనిపోతే కనీసం సానుభూతి కూడా కల్పించలేదు. బీజేపీకి నిజంగా గిరిజనులపై ప్రేమ ఉంటే, మేం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుకు ఎందుకు ఆమోదం తెలపలేదు. తెలంగాణ ఏర్పడ్డాక గిరిజనుల శాతం పెరిగింది కాబట్టి, వారి ప్రాతినిథ్యం పెంచాలని బిల్లును 4 ఏళ్ల క్రితం పంపాం. దాన్ని ఆమోదిస్తారో లేదో కూడా తెలియదు. పార్లమెంటులో గొడవ చేసినా దున్నపోతు మీద వానపడ్డట్లు ఉలుకూ లేదు పలుకూ లేదు.’’


‘‘గిరిజన విశ్వవిద్యాలయం పెడతామని అన్నారు. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న తెలంగాణలోని ఏడు గ్రామాలను ఏపీలో కలిపేశారు. పోలవరం ముంపు ప్రాంతంలో కలిపేశారు. గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ట్రైబల్ యూనివర్సిటీ తెలంగాణకు మంజూరు చేయండి, గిరిజన రిజర్వేషన్లు ఆమోదించాలి.. ఏడు మండలాలను తిరిగి మాకు ఇప్పించాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. 


‘‘రాజకీయ భావదారిద్ర్యానికి ప్రతీక బీజేపీ చేసే చిల్లర రాజకీయాలు. ఆ చిల్లర మార్కు మాకు అవసరం లేదు. మేం మోదీ బొమ్మ పెట్టి చెప్పుల దండ వేసి నిరసనలు చేయగలం. కానీ అలాంటి చిల్లర రాజకీయాలు మేం చేయదల్చుకోలేదు’’ అని కేటీఆర్ విమర్శించారు.