KT Rama Rao US UK Visit తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు యూకే, యూఎస్ పర్యటన గురువారంతో ముగిసింది. రెండు వారాల పాటు సాగిన పర్యటనలో 80కి పైగా వాణిజ్య సమావేశాలు, ఐదు రంగాలకు సంబంధించిన రౌండ్ టేబుల్ సమావేశాలు, రెండు సదస్సుల్లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించగలిగారు. తద్వారా తెలంగాణలో సుమారు 42 వేల ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమమైంది. ముఖ్యంగా లండన్, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, హ్యూస్టన్, హెండర్సన్, బోస్టన్ నగరాల్లో జరిగిన కేటీఆర్ వివిధ సంస్థల ప్రతినిధులతో చేపట్టిన వాణిజ్య సమావేశాల్లో భారీ పెట్టబడులకు సంబంధించిన ప్రకటనలు వెలువడ్డాయి. అయితే బ్యాంకింగ్, బీమా, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, ఏరోస్పేస్, రక్షణ, లైఫ్ సైన్సెస్, మెడికల్ డివై సెస్, డిజటల్ సొల్యూషన్స్, డేటా సెంటర్స్ తదితర రంగాల్లో అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడుల ప్రకటనలు వచ్చాయి. అయితే వీటన్నిటి వల్ల దాదాపు 42 వేల ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు మరో 3 నుంచి 4 రెట్ల ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 






రాష్ట్రంలో భారీ పెట్టబడులు ప్రకటించిన సంస్థల జాబితాలో వార్నర్ బ్రదర్స్, డిస్నీ, మెడ్ ట్రోనిక్, స్టేట్ స్ట్రీట్, లండన్ స్టాక్ ఎక్సేంజీ గ్రూప్, టెక ఎఫ్ఎంసీ, ఆలియంజ్ గ్రూప్, స్టెమ్ క్యూర్స్, జ్యాప్ కామ్ తదితర సంస్థలు ఉన్నాయి. వాణిజ్య సమావేశాలతో పాటు రెండు ప్రధాన సదస్సుల్లోనూ మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. లండన్ లో ఈనెల 12వ తేదీన ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సులో తెలంగాణ మోడల్ ను కేటీఆర్ వివరించారు. అలాగే ఈనెల 15వ తేదీన కొంగర కలాన్ లో జరిగిన ఫాక్స్ కాన్ కంపెనీ శంకుస్థాపనకు వచ్చిన మంత్రి కేటీఆర్.. ఆ వెంటనే అమెరికా టూర్ కు వెళ్లారు. ఈనెల 22వ తేదీన హెండర్ సన్ లో జరిగిన సదస్సులో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ సదస్సులో కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ సాధించిన జల విజయాన్ని ఆవిష్కరించారు. తెలంగాణలో తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి గురించి స్పష్టంగా తెలిపారు. 






అంతేకాదండోయ్ రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఎన్నారై సీఈఓలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ వివరించారు. కేటీఆర్ వెంట వెళ్లిన ప్రతినిధి బృందంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహక విభాగ ప్రత్యే కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, తెలంగాణ డిజిల్ మీడియా వింగ్ డైరెక్టర్ దిలీప్ కొణతం తదితరులు ఉన్నారు.