Telangana BJP :  తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యమని బీజేపీ చాలా సార్లు చెప్పింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెబుతున్నారు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్నా సరే తెలంగాణలో బీజేపీ ఇంత వరకూ యాక్టివ్ కావడం లేదు. గతంలో అయినా పాదయాత్రలనీ..ఇతర కార్యక్రమాలని హడావుడి చేసేవారు. ఇటీవల పూర్తిగా సైలెంట్ కావడమే కాదు..కేంద్రం నుంచి పలుకుబడి ఉన్న నేతలు ఎవరూ రావడం లేదు.. చేవెళ్లలో అమిత్ షా సభ పెట్టారు..కానీ పెట్టినట్లుగా కూడా చాలా మందికి  గుర్తు లేదు. బీజేపీ హైకమాండ్ .. తెలంగాణ విషయంలో సీరియస్‌గా లేదా అన్న సందేహాలు ఈ కారణంగానే వస్తున్నాయి. 


బీజేపీలో చేరికలకు ప్రయత్నాలు నిల్ 


తెలంగాణలో  బీజేపీలోకి చేరికలు ఆగిపోయాయి.  అసలు ఇతర పార్టీలన్నీ  ఖాళీ అయిపోతున్నాయని అందరూ వచ్చి బీజేపీలో చేరుతున్నారని ప్రచారం చేశారు. కానీ ఒక్క పొటెన్షియల్ లీడర్ కూడా చేరకపోతూండటంతో  పార్టీ రాష్ట్ర నాయకత్వం నిరాశ చెందింది. పార్టీలో చేరికల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ వేసినా జాయినింగ్స్ విషయంలో జాప్యం జరుగుతుండటంతో హైకమాండ్ అసంతృప్తితో ఉంది.  రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారం తమదేననే  ధైర్యం నూరిపోస్తున్న హైకమాండ్.. ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి తీసుకురావడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమవుతుండటంతో ఆందోళన చెందుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 119 నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉండాలంటే, చేరికలు అనివార్యమని హైకమాండ్ భావిస్తోంది. గతంలో బీజేపీలోకి టీఆర్ఎస్, కాంగ్రెస్​ల నుంచి భారీగా వలసలు వచ్చినా.. గత కొద్ది నెలలుగా ఈ ప్రక్రియ ఆగిపోయింది. పైగా వచ్చిన వాళ్లు వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతోంది. 


హైకమాండ్ ఆశలు పెట్టుకోవడం లేదా ?


సాధారణంగా బీజేపీ ఏ రాష్ట్రంలో అయినా విజయం సాధించాలంటే వేసే స్కెచ్ వేరుగా ఉంటుంది. ఏడాది ముందుగా ప్రణాళిక ప్రారంభమవుతుంది. ముందుగా త్రివిధ దళాలను పంపుతారని విపక్షాలు సెటైర్లు వేస్తూంటాయి. ఆ త్రివిధ దళాలు సీబీఐ, ఐటీ, ఈడీ. తెలంగాణకు అవి వచ్చాయి కానీ.. పెద్దగా చూపించిన ఇంపాక్ట్ ఏమీ లేదు. ఆ తర్వాత  పెద్ద ఎత్తున చేరికలు చూపిస్తారు. చివరికి ఎన్నికల సమయానికి ఓ టెంపో క్రియేట్ చేస్తారు. తెలంగాణలో మరో నాలుగైదు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ ఉన్నప్పటికీ అలాంటి పరిస్థితి ఏక్కడా కనిపించడం లేదు. ప్రధాని మోదీ, అమిత్ షా లు తరచూ తెలంగాణ పర్యటనకు వస్తారని చెబుతున్నారు కానీ.. రావడం లేదు. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. 


కేంద్ర పార్టీ చెప్పే కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ బీజేపీ 


తెలంగాణ బీజేపీ నేతల్లో ఉన్న అంతర్గత కలహాల కారణంగా సొంతంగా ఏమీ చేయడం లేదు. ప్రస్తుతం  9 ఏళ్ల మోదీ పరిపాలనా విజయాలపై ప్రచారం చేయాలని నిర్ణయించారు. పరిపాలనలో ప్రధాని మోదీ సాధించిన విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందుకోసం మే 30 నుంచి జూన్‌ 30 వరకు ‘మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌’ కార్యక్రమం చేపట్టనున్నారు. తెలంగాణ ఎన్నికల్లో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. బీజేపీతోనే తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుం దని ప్రచారం చేయనున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ఉంటే.. డబుల్‌ ప్రయోజనాలు రాష్ట్రానికి చేకూరుతాయని క్షేత్రస్థాయిలో వివరించాలని అనుకుంటున్నారు.  


అంతర్గత వివాదాలతో మొదటికే మోసం ! 


ఈ మధ్యకాలంలో తెలంగాణ బీజేపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినట్లు  కనిపిస్తోందనీ, కలిసికట్టుగా పనిచేయకుంటే వేటు తప్పదని అధిష్టానం తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లుగా చెబుతున్నారు.  నేతలంతా క్రమశిక్షణతో ఉండటం కూడా చాలా ముఖ్యమని అధిష్టానం దిశానిర్దేశం చేసింది. నేతలు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని  పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ భన్సల్ కూడా హెచ్చరించారు. ఇక వచ్చే నెలలో రెండు భారీ బహిరంగ సభలకు ప్లాన్‌ చేస్తోంది రాష్ట్ర బీజేపీ. ఓ సభకు అమిత్‌షా మరోసభకు జేపీ నడ్డా హాజరవుతారని చెబుతున్నారు. తెలంగాణ పార్టీ నేతల కారణంగానే హైకమాండ్ కార్యాచరణ ఆలస్యమవుతోంది కానీ చేతులెత్తేయలేదని.. బీజేపీ నేతలు అంటున్నారు.