Amaravati Lands : అమరావతి ఆర్-5 జోన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు. అధికారులు అహరహం పనులు చేపడుతుంటే మరోవైపు రైతులు ఆందోళనలకు దిగుతున్నారు రైతులు, పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ ఏర్పడుతోంది. రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్దేశించిన ఆర్-5 జోన్‌లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయటం విరుద్ధమని రైతులు అంటున్నారు. ప్రభుత్వంతో చావో రేవో తేల్చుకుంటామని అంటున్నారు. ముఖ్య మంత్రి పర్యటన ముగిసేంత వరకు అమరావ తిలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. సుప్రీం కోర్టు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేయటంతో ప్రభుత్వం నివేశన స్థలాల వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు ఆర్-5 జోన్ పరిధిలోని 25 లేఅవుట్లలో మెరక, అంతర్గత రహదార్ల పనులను రాత్రిళ్లు సైతం నిర్వహించారు. సీఆర్‌డీఏ అధికారులు ఇక్కడే మకాం వేసి పనులు చేయించారు.
జగన్ ఇచ్చే ఇళ్ల పట్టాలు చెల్లుతాయా ?
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం యాజమాన్య హక్కులు లేని పత్రాలను పంపిణీ చేయాల్సి ఉంటుంది. కోర్టు కేసుల్లో ఉంటే ఇళ్లు కట్టుకోవడానికి ఎలా అనుమతిస్తారని.. ఇప్పుడు యాజమాన్య హక్కులు లేని పట్టాలను ఇవ్వడం వల్ల పేదలకు కూడా పెద్దగా మేలు జరగదని విపక్షాలు అంటున్నాయి. పేదలకు ఇచ్చే స్థలాల్లో లక్షలు పోగు చేసుకుని అక్కడ వారు ఇళ్లు కట్టుకోవాల్సి ఉంటుంది. అలా ఇళ్లు కట్టుకున్న తర్వాత కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే వారి సొమ్ము మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ఇల్లు కట్టుకోండి అని చెబితే ప్రజలు నమ్మరు. అందుకే కోర్టు తీర్పులు క్లియర్ అయిన తర్వాతే అమరావతి భూములు పంపిణీ చేస్తే ప్రభుత్వం నిజాయితీగా ఉందని ప్రజలు నమ్ముతారన్న అభిప్రాయం వినిపస్తోంది. లేకపోతే పేదలు కూడా తమను రాజకీయ కుట్రలకు వాడుకుంటున్నారన్న అభిప్రాయానికి వస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే రోడ్డున పడనున్న కుటుంబాలు
యాబై వేల కుటుంబాలకు అమరావతిలో రైతులు ఇచ్చిన పొలాల్లో సెంటు స్థలాలను కేటాయించడం అంటే చిన్న విషయం కాదు. అయితే ఇలా ఇస్తున్న పట్టాలపై ఒక్క పేద కుటుంబానికి కూడా హక్కు రాదు. రేపు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తే.. ఈ ఇళ్ల స్థలాలు ఇప్పుడు పంపిణీ చేసినా పేదలకు హక్కులు లేకుండా పోతాయి. సీఎం జగన్ పేదలకు సెంటు స్థలాలు ఇవ్వాలనుకుంటే.. అనేక చోట్ల ఇతర స్థలాలు ఉన్నాయని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వివాదాస్పద భూముల్నే ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అమరావతికి రైతులు ఇచ్చిన భూముల్నే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కారణం ఏదైనా ఆయన ఇతర అభ్యంతరాలను పరిగణనలోకి తసుకోవడం లేదు.
ఇళ్ల మంజూరు కోసం కేంద్రానికి లేఖ
అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూముల్ని సెంటు స్థలాలుగా ఇచ్చేసిన వెంటనే అక్కడ ఇళ్లు కూడా కట్టాలని అనుకుంటున్నారు. కానీ ఇళ్లు కట్టాలంటే నిధులు కావాలి. అందుకే ఆర్ 5 జోన్ లో యాభై వేల ఇళ్లు కట్టేందుకు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకూ కేంద్రం ేపీకి ఇరవై లక్షల ఇళ్లు మంజూరు చేసింది కేంద్రానికి మాత్రం మరో యాభై వేల ఇళ్లకు ప్రతిపాదనలు పంపారు. అదీ కూడా ఆర్5 జోన్‌లో . సెంటు స్థలాలను అమరావతి రైతులు ఇచ్చిన భూములను ఇచ్చినప్పటికీ ఇళ్లు మాత్రం కేంద్ర నిధులతో నిర్మిస్తారు. కేంద్రం ఒక్కో ఇంటికి రూ. 1 లక్ష 80 వేలు ఇస్తుంది. అలాగే ప్రభుత్వం లబ్దిదారులకు పావలా వడ్డ కింద మరో రూ. 35వేలు ఇప్పిస్తోంది. ఈ మొత్తంతో ఇళ్లు నిర్మించాలని అనుకుంటున్నారు. అయితే ముందుగా వీటికి కేంద్రం మంజూరు చేయాల్సి ఉంటంది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న భూములు వివాదంలో ఉన్నందున వాటిలో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇస్తుందా అన్నది సస్పెన్స్ గా మారింది.
పేదలకు మేలు జరిగితే సరే లేకపోతే.. తర్వాత ఆయన పేదలతో రాజకీయం చేశారన్న విమర్శలను గట్టిగానే ఎదుర్కోవాల్సి ఉంటుంది.