Komatireddy Venkat Reddy dissatisfaction with CM Revanth : మంగళవారం జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డికి సినీ కార్మికుల అభినందన సభ జరిగింది. ఈ సభకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కాలేదు. ఆయన తన శాఖ పని మీద ముంబైలో ఉన్నారు. తాను లేని సమయంలో సభను ఏర్పాటు చేయడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
కార్మికుల సమ్మె విరమణలో కీలకంగా వ్యవహరించిన మంత్రి కోమటిరెడ్డి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా...కార్మికులు బంద్ చేసినప్పుడు సమస్య పరిష్కారానికి పని చేశారు. ఆయన చొరవతో ముఖ్యమంత్రి రేవంత్ అందరితో చర్చించారు. ఈ మేరకు సమస్య పరిష్కారం కావడంతో షూటింగులు ప్రారంభమయ్యాయి. ఈ కారణంగానే అభినందన సభను ఏర్పాటు చేసినందున తనకు ఆహ్వానం లేకపోడవం..తాను హైదరాబాద్‌లో లేనప్పుడు నిర్వహించడాన్ని ఆయన ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
తన శాఖను సీఎం సన్నిహితుడు ఒకరు హైజాక్ చేస్తున్నారనే భావన
అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తి సీఎంపై కాదని.. తన శాఖను హైజాక్ చేశారని ఓ సీఎం సన్నిహితుడి మీద అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాలను పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి వెంట ఎప్పుడూ ఉండే ఆ నేత చూసుకుంటున్నారని.. తన దాకా రానివ్వడం లేదని కోమటిరెడ్డి భావిస్తున్నారు. ఎఫ్ డీసీ చైర్మన్ గా ఉన్న దిల్ రాజు కూడా ఆయనతో కలిసి మొత్తం పనులు చక్క బెడుతున్నారని..అందుకే.. రేవంత్ సభకు తనకు తెలియకుండా నిర్వహించారని అనుకుంటున్నారు.
కోమటిరెడ్డికి సభ గురించి తెలుసని..ఆయనకు ఎలాంటి అసంతృప్తి లేదంటున్న ప్రభుత్వ వర్గాలు
అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం.. కోమటిరెడ్డి ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదని.. అంటున్నాయి. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో సినీ కార్మికుల ఓట్లు కీలకంగా మారాయి. దాదాపుగా ఇరవై వేల ఓట్లు వారివి ఉంటాయి. అందుకే ఈ అభినందన సభను మూడు రోజుల్లో ఖరారు చేసి నిర్వహించారని అంటున్నారు. ముందస్తుగా నిర్ణయించిన నిర్ణయాలు, పత్తి రైతులకు సంబంధించిన కీలక అంశాలపై సమావేశాలపై కోమటిరెడ్డి ముంబైలో ఉన్నందునే హాజరు కాలేకపోయారని అంటున్నారు.
మంత్రులతో వరుసగా సీఎం రేవంత్ కు అభిప్రాయ బేధాలు
ఇటీవలి కాలంలో మంత్రులతో రేవంత్ రెడ్డికి పొసగని పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు సహా పలువురు మంత్రులతో వివాదాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే బాటలో ఉన్నారన్న ప్రచారంతో తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం బయలుదేరింది.