తెలంగాణ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను కేంద్ర మంత్రులు దిల్లీలో ప్రశంసిస్తూ.. గల్లీలో విమర్శిస్తున్నారని రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే రాష్ట్రానికి నిధులు ఇచ్చి వాటా గురించి మాట్లాడానికి అన్నారు. ఓ వైపు అవార్డులు ఇస్తూనే మరోవైపు ప్రభుత్వ పనితీరు బాగోలేదంటూ రాజకీయ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని చెప్పుకొచ్చారు. మిగిలిన ఉచిన విద్యుత్, రైతుబంధు పథకాలను కూడా కాపీ కొట్టి దేశ వ్యాప్తంగా అమలు చేయాలని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. అలాగే రెండు రోజులకు ఒకసారి రాష్ట్రానికి వచ్చే కేంద్ర మంత్రులు... తెలంగాణ పథకాలను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. 


రాష్ట్రానికి 5 వేల 300 కోట్ల ప్రత్యే నిధులు ఇవ్వాలన్న 15వ ఆర్థిక సంఘం నివేదిక, మిషన్ భగీరథకు 19 వేల కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆక్షేపించారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక మిషన్ భగీరథకు అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. జల్ జీవన్ మిషన్ కు బూస్ట్ లా పని చేస్తుందంటూ ఇచ్చిన ప్రశంసలు తెలంగామ ప్రభుత్వ పని తీరుకు నిదర్శనం అన్నారు. సమస్యలకు తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తున్న నాయకుడు కేసీఆర్ అని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, మోకాలు యాత్రలు చేస్తున్న నాయకులు ఎక్కడైనా నీళ్లు, విద్యుత్ గురించి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. ఈయనతో పాటు మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు కూడా ఉన్నారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు సృష్టించినా అవార్డుల పంటతో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని అన్నారు. అవార్డులే కాకుండా రాష్ట్రానికి నిధులూ ఇవ్వాలని కోరారు. 


అసెంబ్లీలో కూడా కేంద్రం ఇవ్వాల్సిన నిధులపై చర్చ..


ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్రాల రుణ పరిమితిపై హైపవర్‌ ఇంటర్‌ గవర్నమెంట్‌ కమిటీ వేసి సమీక్షించాలని 15వ ఆర్థిక సంఘం సూచిస్తే కేంద్రం మాత్రం తనకు నచ్చినట్టు సవరించిందన్నారు హరీష్‌. రాష్ట్రాల నుంచి సభ్యులను చేర్చి ఉంటే సరైన నిర్ణయం జరిగేదని అభిప్రాయపడ్డారు. బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు ఉండాలన్నదే కేంద్రం అసలు కుట్రని ఆరోపించారు. రాష్ట్రాలను బలహీనపరచాలనే ఉద్దేశంతో ఏకపక్షంగా ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట సవరణలు చేశారన్నారు. ఆ సవరణలను మాత్రం కేంద్రం పాటించదని... రాష్ట్రాలపై మాత్రమే రుద్దే ప్రయత్నం చేస్తోందన్నారు. కేంద్రానికో నీతి, రాష్ట్రానికో నీతి ఉంటదా? అని ప్రశ్నించారు హరీష్‌. కేంద్రం కూడా కార్పొరేషన్ల మీద.. తన రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు పెద్ద ఎత్తున అప్పులు తీసుకురాలేదా అని నిలదీశారు. కేంద్రం అప్పులను మాత్రం రికవరీలో పెట్టలేదని... తాము ప్రభుత్వరంగ సంస్థల నుంచి తీసుకుంటే రికవరీ చేస్తామంటూ అప్పుల తగ్గిస్తున్నారన్నారు.  


విద్యుత్‌ సంస్కరమలు అమలు చేస్తామంటే... అరశాతం ఎఫ్‌ఆర్‌బీఎం ఇస్తామని లేకుంటే ఇవ్వబోమంటూ చెప్పారని గుర్తు చేశారు హరీష్‌. విద్యుత్ మీటర్లు పెట్టేందుకు, విద్యుత్‌ సంస్కరణలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంగీకరించలేదని తెలిపారు. దీని వల్ల అరశాతం అంటే రూ.6104కోట్లు రాష్ట్రం వదులుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఈ డబ్బు సమకూర్చడం ముఖ్యమా? రైతుల ప్రయోజనాలు ముఖ్యమా? అని ఆలోచించి 60లక్షల రైతుల ప్రయోజనాలే ముఖ్యమని భావించామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే రూ.6104 కోట్లు వదులుకొని మూడున్నర శాతం ఎఫ్‌ఆర్‌బీఎంతోని రాష్ట్ర శాసనసభలో బడ్జెట్‌ను పొందుపరిచిందని గుర్తు చేశారు.