Minister Harishrao: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. పార్టీల మధ్య మాటల వార్ హీట్ పుట్టిస్తోంది. నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటుండటంతో ఎన్నికల వేడి మరింత పెరిగింది. ఎన్నికల ప్రచారం మొదలుకాకముందే రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం కాక రేపుతుండగా.. ఎన్నికల షెడ్యూల్ వచ్చి ప్రచారపర్వం మొదలుపెట్టిన తర్వాత నేతల మాటల తూటాలు మరింతగా రాజకీయాలను వేడెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి మరోసారి జైలుకెళ్లడం ఖాయమని ఆరోపించారు. సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డికి ఊరట లభించలేదని, ఈ కేసు విచారణ కొనసాగించాలని న్యాయస్థానం చెప్పిందన్నారు. ఈ కేసులో విచారణ జరగుతుందని, భవిష్యత్తులో రేవంత్ జైలుకెళ్లడం పక్కా అని తెలిపారు. ఎమ్మెల్సీని కొనుగోలు చేస్తూ పట్టుబడ్డ రేవంత్ తప్పనిసరిగా విచారణను ఎదుర్కొవాల్సిందేనని, ఆయన ఒక దొంగ అని ఘాటుగా విమర్శలు కురిపించారు. ఈ కేసు విచారణ ఏసీబీ పరిధిలోకి రాదని రేవంత్ సుప్రీంకోర్టుకెళ్లినా అక్కడ రిలీఫ్ దొరలేదని, ఇంకా ఆయనను ఈ కేసులో ఎవరూ తప్పించలేరని అన్నారు.
డబ్బులు పంచి గెలవాలని రేవంత్ చూస్తున్నారని, ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని హరీష్ రావు అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ఇవాళ 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి మంత్రి హరీష్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో హరీష్ పాల్గొని ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ గెలిచే పరిస్థితి లేదని, బీఆర్ఎస్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఏ సర్వేను చూసినా బీఆర్ఎస్‌నే అధికారంలోకి వస్తుందని చెబుతుందని, బీఆర్ఎస్ గెలుపులో ఎలాంటి అనుమానం లేదన్నారు. తమ ప్రభుత్వం రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తుంటే.. 3 గంటల కరెంట్ చాలని రేవంత్ తన కడుపులోని మాటను బయటపెట్టారన్నారు. కొండగల్‌లో రేవంత్ ఏమీ చేయలేదని ప్రజలు ఓడిస్తే.. మల్కాజ్‌గిరి వెళ్లారని విమర్శించారు.
కొడంగల్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి ఒక్క ప్రభుత్వ ఆస్పత్రి కూడా తీసుకురాలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో మూడు ఆస్పత్రులను మంజూరు చేసినట్లు తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీటిని అందిస్తున్నామని, రేవంత్ రెడ్డి పదేళ్లు ఎమ్మెల్యేగా పని చేసి ఒక్క ఇంటికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని విమర్శించారు. వ్యవసాయం దండగ అని అప్పట్లో చంద్రబాబు అంటే, రైతులకు ఉచిత కరెంట్ దండగ అని రేవంత్ అన్నారని ఆరోపించారు. 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని హరీష్ సూచించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని ఇక్కడి నేతలు చెబుతున్నారని, కర్ణాటకలో కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, గృహలక్ష్మి వంటి పథకాలు ఉన్నాయా? అని హరీష్ ప్రశ్నించారు. త్వరలోనే తమ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేస్తామని, అందులో మహిళల కోసం ప్రత్యేక పథకాలు ఉంటాయన్నారు. మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేసే దిశగా తమ పార్టీ మ్యానిఫెస్టోలోని హామీలు ఉంటాయని హరీష్ పేర్కొన్నారు.