Medigadda Barrage News: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనను కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. దీనిపై విచారించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సోమవారం హైదరాబాద్ లోని రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులతో ఈ కమిటీ సమీక్ష నిర్వహించనుంది. అనంతరం మంగళవారం మేడిగడ్డ జలాశయాన్ని సందర్శించనుంది. కుంగిన ఫిల్లర్లను కేంద్ర బృందం పరిశీలించనుంది. దీనిపై పూర్తి నివేదికను నిపుణుల కమిటీ కేంద్ర జలశక్తి శాఖకు అందించనుంది.
ఇదీ జరిగింది
కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భాగంగా ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ మహాదేవపూర్ మండలం అంబటిపల్లి వద్ద శనివారం ఒక్కసారిగా కుంగింది. భారీ శబ్దంతో బీ - బ్లాకులోని 18, 19, 20, 21 ఫిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఓ అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20 ఫిల్లర్ కుంగడంతోనే వంతెన కుంగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. బ్యారేజీ పొడవు 1.6 కి.మీ ఉండగా, సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. బ్యారేజీ అకస్మాత్తుగా కుంగడంతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది.
ప్రతిపక్షాల విమర్శలు
మరోవైపు, వంతెన కుంగడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ఫిల్లర్ కుంగిపోవడానికి సీఎం కేసీఆర్ కుటుంబమే కారణమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిలో మొదటి దోషి ఆ కుటుంబమేనన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రూ.లక్ష కోట్లను కేసీఆర్, కాంట్రాక్టర్లు దోచుకున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై, కేంద్ర హోం మంత్రి, గవర్నర్, ఈసీ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అటు, బీజేపీ నేతలు సైతం బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతోనే కేసీఆర్ అవినీతి బయట పడిందని బీజేపీ నేత బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం 2016 మే 2న చేపట్టగా, 2019 జూన్ 21న ప్రారంభించారు. ఎల్అండ్ టీ సంస్థే దీన్ని నిర్మించింది. నిర్మాణ దశలోనే బ్యారేజీలోని 20వ నెంబర్ ఫిల్లర్ వద్ద పగుళ్లు వచ్చాయని, అప్పట్లో దానికి మరమ్మతులు చేసి పనులు పూర్తి చేశారనే ఆరోపణలు వచ్చాయి. బ్యారేజీ నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలుగా ఉంది. వంతెన కుంగిన విషయాన్ని మహారాష్ట్రకు వెళ్తున్న వాహనదారులు గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు అప్రమత్తమై రాకపోకలు నిలిపేశారు.