Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ రైతు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి, లక్ష్మాపూర్ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మూడు చింతలపల్లి ధరణి పోర్టల్ ను ప్రారంభించారన్న రేవంత్ రెడ్డి, ఈ గ్రామంలోనే ధరణిలో అనేక సమస్యలున్నాయన్నారు. ఈ గ్రామంలో 582 మందికి ఖాతా నెంబర్లు లేవని, రెవెన్యూ నక్ష లేదన్నారు. దీంతో గ్రామంలో రైతు బంధు పథకం అమలు చేయడంలేదని, రైతు బీమా రావడం లేదన్నారు. పాస్ పుస్తకాలు లేకపోవడంతో రైతులకు చాలా నష్టాలు జరుగుతున్నాయన్నారు. గ్రామంలో పూర్తిగా సర్వే చేయించి టీ పన్ ప్రకారం సమస్యలు పరిష్కరించాలని రేవంత్ రెడ్డి సూచించారు. 






మల్లారెడ్డిపై ఫైర్ 


మంత్రి మల్లారెడ్డిపై కూడా రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన బావమరిది భూకబ్జాలు, అక్రమాలు, అవినీతిపైన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విచారణ చేయిస్తామని అన్నారు. అధికారంలోకి రాగానే  
 సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్ రోడ్డు వేస్తే లక్ష్మపూర్ గ్రామంలో కుమ్మరి ఎలవ్వ ఇల్లు పోయిందని, ఒక్క ఇల్లు కట్టిస్తే ముల్లె పోతాదా అని విమర్శించారు. కలెక్టర్ వెంటనే కట్టివ్వకపోతే కాంగ్రెస్ తగిన గుణపాఠం చెబుతుందన్నారు. ప్రభుత్వం ఇళ్లు కట్టించకపోతే కుమ్మరి ఎల్లవ్వకు ఇల్లు కట్టిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీస్కుంటాదన్నారు. ఈ గ్రామంలో ధరణి పోర్టల్ ప్రారంభిస్తే ఇక్కడే నక్ష లేదన్నారు. 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని, రాగానే నెల రోజుల్లో ఇదే గ్రామంలో అందరికీ పాసు పుస్తకాలు ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. 


గిట్టుబాటు ధరలు కల్పిస్తాం


కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల వద్దకు వచ్చి రూ.2500 చొప్పున క్వింటాల్ ధాన్యం కొంటామన్నారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించికొంటామన్నారు. కూరగాయలు, పండ్లు కూడా మంచి ధరలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. వరంగల్ డిక్లరేషన్ తర్వాత 15 రోజులు ఫామ్ హౌస్ లో పండుకొని ఇప్పుడు లేసి దిల్లీకి పోయి పంజాబ్ రైతులకు చెక్ లు ఇస్తున్నారన్నారు. మనం పన్నులు కడితే మన రైతులకు పరిహారం ఇవ్వకుండా, ఇక్కడ కుమ్మరి ఎల్లమ్మకు ఇల్లు ఇవ్వరు కానీ పంజాబ్ కు పోయి అక్కడ రైతులకు చెక్ లు ఇస్తున్నారని విమర్శించారు. 


పంజాబ్ లో ఎలాగబెడుతారట


'ఇక్కడ రైతులకు న్యాయం చేయనోడు పంజాబ్ లో ఎలాగబెడుతాడట. ఇక్కడ సమస్యలు పరిష్కరించి ఇతర ప్రాంతాలకు పోతే మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ రైతులు నానా కష్టాలు పడుతుంటే పంజాబ్ రైతులకు రాజకీయ స్వార్థం తోటి చెక్ లు ఇచ్చి రాజకీయాలు చేస్తుండు. రైతు డిక్లరేషన్ ను 12 వేల గ్రామాలలో ప్రచారం చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రైతులకు న్యాయం జరుగుతాది. కేసీఆర్ గద్దె దిగితేనే రాష్ట్రంలో రైతులకు న్యాయం జరుగుతాది. నాలుగు రోజులు కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రంలో ఇకపోతే తెలంగాణ సంతోషంగా ఉంది. మొత్తమే కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేర దాటిస్తే తెలంగాణ సంతోషంగా ఉంటుంది.' అని రేవంత్ రెడ్డి అన్నారు. 


రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా లక్ష్మపూర్ గ్రామానికి వచ్చి రేవంత్ రెడ్డి గ్రామంలో రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన కుమ్మరి ఎలవ్వ ఇంటిని సందర్శించి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మేడ్చల్ కలెక్టర్ తో మాట్లాడి వెంటనే ఎల్లవ్వకు ఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కట్టివ్వకపోతే నెల రోజులలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇల్లు కట్టిస్తామని చెప్పారు.