Fire Accident In RTC Cross Road : హైదరాబాద్‌ నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో మెట్రో స్టేషన్ కింద భారీగా మంటలు చెలరేగాయి. మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి శ్రీ దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్‌లో బుధవారం (జులై 10న) రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగారు. రెండు అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


అయితే ఆ దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్ పక్కనే తపాడియా ఆస్పత్రి ఉండడంతో  ఆస్పత్రి మేనేజ్‌మెంట్ అగ్నిప్రమాదంపై అప్రమత్తం అయింది. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను హుటాహుటిన అక్కడి నుంచి బయటకు తరలించారు.  మంటల దాటికి కాంప్లెక్స్‌ అద్దాలు పగిలి రోడ్డుపై పడ్డాయి.  దీంతో పోలీసులు ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రమాదంలో సంభవించిన ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.


దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.  అధికారులు, పోలీసులు.. అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది అనేదానిపై దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. ఈ అగ్ని ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతం మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్‌ వైపు వెళ్లే వాహనాలను  ట్రాఫిక్ పోలీసులు ఆపేశారు. ఈ ఘటనతో ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతంలోని జనాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇక ఆ దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఫర్నీచర్ షోరూం ఉండగా.. అందులోకి కూడా మంటలు వ్యాపించాయి. వాటికి మంటలు అంటుకుని భారీగా ఎగిసి పడుతున్నాయి.  ఆ ప్రాంతం మొత్తం మంటలు, దట్టమైన పొగ అలుముకుంది.


జీడిమెట్లలో అగ్ని ప్రమాదం
ఇది ఇలా ఉంటే మంగళవారం జీడిమెట్ల పారిశ్రామికవాడలో మరో  అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలోని రొయ్యల దాణా తయారీ కంపెనీలో ఈ ప్రమాదం సంభవించింది. ఉదయం ఒక్కసారిగా గోదాముల నుంచి దట్టమైన పొగలు రావడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారమందుకున్న పోలీసులు, ఫైర్​ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు. అయితే ప్రమాదానికి కారణం షార్ట్​ సర్క్యూట్​ అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.