Shamshabad: 


అనుమతి ఇచ్చిన తరవాతే నిర్మించారు: ముస్లిం నేతలు


హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో మున్సిపల్ అధికారులు మసీదుని కూల్చివేయటం పెద్ద వివాదానికి దారి తీసింది. శంషాబాది శివార్లలోని గ్రీన్ అవెన్యూ కాలనీలోని మసీదుని తెల్లవారుజామున కూల్చి వేశారు. పోలీసుల ఆధ్వర్యంలోనే ఈ కూల్చివేత జరిగిందని స్థానిక ముస్లింలు ఆరోపిస్తున్నారు. ఇది చూసి ముస్లిం నేతలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి నిరసన చేపట్టారు. AIMIM నేతలతో పాటు మజ్లిస్ బచావో తెహరీక్ (MBT)నేతలూ ఆందోళనలు చేశారు. మూడేళ్ల క్రితం ఈ మసీదు నిర్మించారని, రోజుకు 5 సార్లు నమాజ్ చేసుకుంటామని చెప్పారు ముస్లిం నేతలు. శంషాబాద్ గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చిన తరవాతే 15 ఎకరాల్లో ఉన్న గ్రీన్ అవెన్యూ కాలనీలో ప్లాట్‌లు చేసి విక్రయించారని చెబుతున్నారు. ఇందులో 250  చదరపు గజాల స్థలం..మసీద్‌కు కేటాయించారని వెల్లడించారు. మసీదు పక్కనే ఇళ్లు ఉన్న కొందరు, నిబంధనలకు వ్యతిరేకంగా మసీదు కట్టారని కోర్టులో కేసు వేశారు. దీనిపై కోర్టులో విచారణ జరుగుతుండగానే, అధికారులు ఇలా కూల్చివేయటం సరికాదని ముస్లిం నేతలు మండి పడుతున్నారు. మున్సిపాలిటీ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వీరిని అదుపులో తీసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెరాస అధికారంలోకి వచ్చాక 2014 నుంచి 6 మసీదులను ఇలాగే కూల్చివేశారని ఆరోపించారు.