Marwari Go Back Politics: హైదరాబాద్ శివారులోకి వచ్చేసిన అమనగల్లులో.. ఓ దుకాణం ముందు పార్కింగ్ గురించి గొడవ జరిగింది. బండి పార్కింగ్ చేసిన యువకుడితో దుకాణాదారుడు గొడవ పెట్టుకున్నాడు. ఈ గొడవలో దుకాణయజమాని బంధువు.. బండిని పార్కింగ్ చేసిన వ్యక్తిని కొట్టాడు. ఆ వివాదం ఇప్పుడు మార్వాడీ గో బ్యాక్ అనే నినాదానికి కారణం అయింది. ఆ దుకాణదారుడు మార్వాడీ.. పార్కింగ్ వివాదంలో అతను కొట్టింది.. ఓ దళితయువకుడ్ని.  ఘర్షణ పడినప్పుడు వారికి సంబంధించిన ఈ వివరాలేమీ వారికి తెలియవు కానీ.. ఇప్పుడు వాటితోనే అసలు వివాదం ప్రారంభమయింది. 

18న అమనగల్లు బంద్ - మార్వాడీ గోబ్యాక్ నినాదం

అమనగల్లులో మార్వాడీల వ్యాపారాలు ఎక్కువ అయిపోయాయని స్థానికలకు వ్యాపారాలు లేకుండా మొత్తం వారే అక్రమించుకుంటున్నారని..పైగా దోచుకుంటున్నారని , దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపిస్తూ..అమనగల్లు బంద్ కు పిలుపునిచ్చారు. ఇది మెల్లగా రాష్ట్ర వ్యాప్తంగా పాకుతోంది. చాలా మంది మార్వాడీ గోబ్యాక్ నినాదాలను సోషల్మీడియాలో చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్లా మార్వాడీలే ఉంటున్నారని.. తెలంగాణ ప్రజలకు చిరు వ్యాపారాలకు కూడా అవకాశం లేకుండా చేస్తున్నారని..  ప్రతి చిన్న ఊరిలోకి వచ్చి వ్యాపారాలు పెట్టేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. 

ఈ ప్రచారం వెనుక కుట్ర ఉందన్న బండి సంజయ్    తెలంగాణలో మార్వాడీ వ్యాపారులు  ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు కిరాణా దుకాణాల నుంచి   నిర్మాణ సామాగ్రి , స్వీట్ షాపులు, హోటళ్ల వరకూ  విస్తరించారు.   వీరి వల్ల  స్థానిక తెలంగాణ వ్యాపారులు, ముఖ్యంగా చిన్న వ్యాపారులు, మార్వాడీలు తమ వ్యాపార అవకాశాలను ఆక్రమిస్తున్నారని, తద్వారా తమ జీవనోపాధి దెబ్బతింటోందన్న విమర్శలు అప్పుడప్పుడూ వస్తున్నాయి. ఇప్పుడు పార్కింగ్ వివాదంతో పెద్దదయింది.  ఈ తరహా ప్రచారంపై బీజేపీ కుట్ర ఉందని అంటోంది.    మార్వాడీలను లక్ష్యంగా చేయడం కంటే, అక్రమ బంగ్లాదేశీలు ,  రోహింగ్యాలపై దృష్టి పెట్టాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.   ప్రతి భారతీయుడికి దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసే రాజ్యాంగబద్ధమైన హక్కు ఉందని  ఈ ప్రచారాన్ని రాజకీయంగా  ఆరోపిస్తున్నారు. 

హిందూ ఐక్యతను దెబ్బతీసే కుట్రనా ? 

మార్వాడీలపై వ్యతిరేక ప్రచారం హిందూ ఐక్యతను దెబ్బతీసే కుట్రగా పేర్కొంటున్నారు.  బీజేపీ మార్వాడీలకు మద్దతు ప్రకటించింది.  కాంగ్రెస్ పార్టీ ఇతరుల్ని రెచ్చగొడుతోందని అంటున్నారు.  అయితే ఇప్పటి వరకూ నేరుగా కాంగ్రెస్ ఈ వివాదంపై స్పందించలేదు. భారత రాష్ట్ర సమితి కూడా స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాజకీయంగా లాభనష్టాలు బేరీజులు వేసుకుని పార్టీలు రంగంలోకి దిగే అవకాశం ఉంది.  కొంత మంది బీఆర్ఎస్ కార్యకర్తలు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.