తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎనిమిదో రోజు ఆదివారం (ఫిబ్రవరి 12) ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లు, నకిలీ విత్తనాల అంశం సభలో చర్చకు వచ్చింది. దీనిపై సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో జనాభాకు తగ్గట్లుగా మార్కెట్లు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గతంలో ఆరేడు మార్కెట్లు మాత్రమే ఉండేవని చెప్పారు. శాస్త్రీయ దృక్పథం లేకుండా మార్కెట్లు నిర్మించారని విమర్శించారు. నిజాం హయాంలో కట్టిన మోండా మార్కెట్‌ని చూసి తాను ఆశ్చర్యపోయానని అన్నారు. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో సరిపడా వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లు ఉండాలని చెప్పారు. ఈ అంశంపై హైదరాబాద్‌ మార్కెట్లపై అధికారులతో సమీక్ష కూడా పెట్టామని గుర్తు చేశారు. కనీసం 2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నారాయణపేట కూరగాయల మార్కెట్‌ చాలా అద్భుతంగా కట్టినట్లు తాను విన్నానని చెప్పారు.


రాష్ట్రంలో చాలాచోట్ల కూరగాయల మార్కెట్లు సరిగ్గా లేవని, వాటిలో మురికి, మట్టి, దుమ్ము లాంటి సమస్యల మధ్య కూరగాయలు అమ్మే పరిస్థితి ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ క్రమంలోనే తాము, తమ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లకు శ్రీకారం చుట్టామని చెప్పారు. అధునాతన కూరగాయల మార్కెట్లు ప్రతి నియోజకవర్గంలో తేవాలనే ఆలోచన ఉందని తెలిపారు. మోండా మార్కెట్‌ని కలెక్టర్లందరికీ చూపించామని, అలాంటి మార్కెట్లు అన్ని జిల్లాల్లో నిర్మించాలని చెప్పామని అన్నారు.


కల్తీ, నకిలీ విత్తనాలపైనా సీఎం సమాధానం
కల్తీ విత్తనాల గురించి పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం చెప్పారు. కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తున్నామని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని, అణచివేస్తామని కేసీఆర్‌ హెచ్చరించారు. 


ఈ నెల 3న న ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఇవాల్టితో (ఫిబ్రవరి 12) ముగియనున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చతో పాటు పద్దులపై కూడా ఇప్పటికే చర్చ పూర్తయింది. శాసన సభలో గత మూడు రోజులుగా మొత్తం 37 పద్దులపై చర్చించి ఆమోదం తెలిపారు. ప్రశ్నోత్తరాల అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుపై ఉభయ సభల్లో చర్చ జరుగుతూ ఉంది.


బస్తీ దవాఖానాలపై మంత్రి హరీశ్ రావు సమాధానం
బస్తీల సుస్తీ పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖాలు ప్రారంభించారని మంత్రి హరీశ్ రావు అన్నారు. బస్తీ దవాఖానాలు పేద ప్రజల సుస్తీలు పోగొట్టి, దోస్తీ దవాఖనలుగా పేరు తెచ్చుకున్నాయని మంత్రి హరీశ్ రావు తనదైన శైలిలో చెప్పారు. రూ.800 విలువ చేసే లిక్విడ్ ప్రొఫైల్ టెస్ట్ 1.48 లక్షల మందికి, థైరాయిడ్ పరీక్షలు లక్షా 800 మందికి చేశామని లెక్కలు చెప్పారు. మొత్తం 57 రకాల పరీక్షలు చేస్తున్నామని, 134 రకాల పరీక్షలు త్వరలో పెంచుతామని అన్నారు. ఆదివారం కాకుండా శనివారం బస్తీ దవాఖానలకు సెలవు ఇస్తున్నామని చెప్పారు. 158 రకాల మందులు ఉచితంగా అందజేస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. బస్తీ దవాఖానలు స్థానికంగా సేవలందిస్తుండడం వల్ల పెద్ద ఆస్పత్రుల్లో ఓపి తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. 


ఇప్పటిదాకా కోటి మంది ప్రజలు బస్తీ దవాఖాన సేవలు పొందారని అన్నారు. వచ్చే ఏప్రిల్‌లో అన్ని జిల్లాలకు న్యూట్రిషన్ కిట్‌లు అందజేస్తామని చెప్పారు. బస్తీ దవాఖానలో త్వరలో బయోమెట్రిక్ విధానం ప్రవేశపెడతామని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1,500 ఆశా పోస్టులు ఈ నెలలో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.