మార్గదర్శి చిట్ ఫండ్ ఎండీ శైలజా కిరణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ సీఐడీ అధికారులు జారీ చేసిన లుక్ ఔట్ నోటీసుల అమలును నిలిపి వేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఆమె పిటిషన్ వేశారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న శైలజా కిరణ్ తరఫున ఆమె న్యాయవాది వి. రత్నకుమార్ ఈ పిటిషన్ వేశారు. అమరావతి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల్లో కఠిన చర్యలు తీసుకోకూడదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించేలా లుక్ ఔట్ నోటీసు ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏపీ సీఐడీ వినతి మేరకు ఇమిగ్రేషన్ అధికారులు ఇచ్చిన లుక్ ఔట్ నోటీసును రద్దు చేయాలని కోరారు. అమెరికాలో ఉన్న శైలజా కిరణ్, జూన్ 3న తిరిగి హైదరాబాద్‌కు వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్నారని, సీఐడీ విచారణకు శైలజ సహకరిస్తున్నారని వివరించారు. అయినా లుక్ ఔట్ నోటీసు ఇవ్వడం అన్యాయమని అన్నారు. జూన్ 6న విచారణకు హాజరు కావడానికి అమెరికా నుంచి జూన్ 3న వస్తారని పిటిషన్ లో తెలిపారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో లుక్ ఔట్ నోటీసులు అమలు చేయద్దని పిటిషన్ లో కోరారు.