BRS Joinings :   భారత  రాష్ట్ర సమితిలో ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు వరుసగా వచ్చి చేరుతున్నారు. జాగా  వన‌ప‌ర్తి జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. మంత్రి నిరంజ‌న్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే ఆల వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, మాజీ ఎంపీ మందా జ‌గ‌న్నాథంతో పాటు ప‌లువురు నాయ‌కులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


 





 
టీడీపీ సీనియర్ నేతగా ఇంత కాలం ఉన్న రావుల


రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి టీడీపీ త‌ర‌పున 1994, 2009 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌న‌ప‌ర్తి నియోక‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో ఏపీ ప్ర‌భుత్వ విప్‌గా ప‌ని చేశారు. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కూడా ఎన్నిక‌య్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఇక్క‌డి టీడీపీ ముఖ్య నాయ‌కులు వివిధ పార్టీల తీర్థం పుచ్చుకున్నారు. రావుల మాత్రం టీడీపీలోనే కొన‌సాగుతున్నారు. చంద్ర‌బాబు ఆయ‌న‌ను పొలిట్‌బ్యూరో స‌భ్యుడిగా కూడా నియ‌మించారు. వ‌న‌ప‌ర్తి జిల్లాలో రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి మంచి ప‌ట్టుంది.



బీఆర్ఎస్‌లో మళ్లీ చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి 


తెలంగాణ ఉద్య‌మ‌కారుడు జిట్టా బాల‌కృష్ణారెడ్డి, టీఎన్జీవోల సంఘం అధ్య‌క్షుడు మామిళ్ల రాజేంద‌ర్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో బాల‌కృష్ణారెడ్డి, రాజేంద‌ర్ గులాబీ గూటికి చేరారు. వీరిద్ద‌రికి కేటీఆర్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. జిల్లా బాలకృష్ణారెడ్డి టీఆర్ఎస్ యువజన విభాగ అధ్యక్షునిగా పని చేశారు. తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. యువ తెలంగాణ పార్టీ పెట్టడంతో పాటు కాంగ్రెస్, బీజేపీల్లోనూ చేరారు. చివరికి సొంత గూటికి చేరుకున్నారు. 


 





 


బీఆర్ఎస్‌లోకి త‌న‌ను ఆహ్వానించినందుకు పార్టీ నాయ‌క‌త్వానికి జిట్టా బాలకృష్ణారెడ్డి ధ‌న్య‌వాదాలు తెలిపారు. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పూల‌మాల వేస్తుంటే ఒళ్లు పుల‌క‌రించింది. సీఎం కేసీఆర్ త‌న‌ను మ‌నస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు ధ‌న్య‌వాదాలు చెప్పారు. రామ‌న్న‌, హ‌రీశ్ అన్న నాయ‌క‌త్వంలో అడుగులో అడుగేసి న‌డుస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. గౌర‌వం ఉన్న‌చోటుకే ఉద్య‌మ‌కారులంతా రావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌ను మ‌ళ్లీ అధికారంలోకి తీసుకొద్దామ‌న్నారు. కేసీఆర్ నాయ‌క‌త్వ‌మే తెలంగాణ‌కు శ్రీరామ ర‌క్ష అని జిట్టా బాల‌కృష్ణారెడ్డి స్ప‌ష్టం చేశారు.