Kisan Cell President Manik Kadam : బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తో పాటు మహారాష్ట్ర, ఒడిశాలపై కేసీఆర్ ఫోకస్ చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించిన సమయంలో బీఆర్ఎస్ లోకి చేరికలు జరిగాయి. తాజాగా బీఆర్‌ఎస్‌ మహారాష్ట్ర కిసాన్‌సెల్‌ అధ్యక్షుడిగా మాణిక్‌ కదమ్‌ నియమితులయ్యారు. మహారాష్ట్రలో పార్టీ విస్తరణపై దృష్టిసారించిన కేసీఆర్ ఆ రాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సెల్ బాధ్యతలను మాణిక్ కదమ్ (Manik Kadam) కు అప్పగించారు. 


మహారాష్ట్రపై కేసీఆర్ ఫోకస్.. 
అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అనే నినాదంతో కేసీఆర్ దేశ వ్యాప్తంగా నినదిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు సైతం రాష్ట్రాల్లో రైతుల కోసం తీసుకొచ్చిన రైతు బంధు, రైతు బీమా వివరాలను బీఆర్ఎస్ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడిగా జాతీయ రైతు సంఘం నేత గుర్నాంసింగ్‌ చడూనీని నియమించడం తెలిసిందే. తాజాగా రైతు మాణిక్ కదమ్ కు మహారాష్ట్ర బీఆర్ఎస్ విభాగం అధ్యక్షుడిగా కేసీఆర్ నియమించారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. అక్కడ అధికారంలోకి వస్తే రైతులకు రైతు బంధు ఇస్తాను, 24 గంటలు విద్యుత్ అన్నదాతలకు అని ఇటీవల నాందేడ్ లో జరిగిన బీఆర్ఎస్ సభలోనూ కేసీఆర్ స్పష్టం చేశారు. 






సీఎం కేసీఆర్ తనను బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సెల్ విభాగం అధ్యక్షుడిగా నియమించడంపై మాణిక్ కదమ్ హర్షం వ్యక్తం చేశారు. సాధారణ రైతునైన తనకు పార్టీ కిసాన్ విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో రైతులకు అండగా నిలబడేందుకు, అన్నదాతల కన్నీళ్లు తుడిచేందుకు కేసీఆర్, బీఆర్ఎస్ శ్రమిస్తున్నాయని మాణిక్ కదమ్ అన్నారు. ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలని, సహకారం అందించాలని కోరారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ తో కలిసి దిగిన ఓ ఫొటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.


ఇన్నేళ్లయినా చాలా గ్రామాల్లో తాగునీరు, సాగు నీరు లేదన్నారు. కరెంట్‌ సదుపాయం లేకుండా వందల గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయని నాందేడ్ లో బీఆర్ఎస్ సభలో కేసీఆర్ అన్నారు. వనరులు ఉన్నా ప్రభుత్వాల చేతకాని పరిస్థితుల వల్లే ఇది జరిగిందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశంలో విప్లవాత్మక మార్పు అవసరం ఉందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు పరిస్థితి ఉందని ఆవేదన చెందారు. ఇన్నేళ్లయినా చాలా గ్రామాల్లో తాగునీరు, సాగు నీరు లేదన్నారు. కరెంట్‌ సదుపాయం లేకుండా వందల గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయన్నారు. దేశంలో నాయకత్వ మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. మహారాష్ట్రలో అత్యధిక ఆత్మహత్యలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు.