Balka Suman Comments on Revanth Reddy: మంచిర్యాల జిల్లాలో పార్లమెంటు స్థాయి సమావేశంలో రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. చెప్పుతో కొడతా నా కొడకా అంటూ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్ పై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేయడంపై బాల్క సుమన్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణను సాధించిన నాయకుడు కేసీఆర్ ను లంగా అని మాట్లాడుతున్నాడు రండగాడు.. హౌలే గాడు రేవంత్ రెడ్డి’’ అని బాల్క సుమన్ వ్యాఖ్యనించారు. చెప్పు తీసుకొని కొట్టినా తప్పులేదని చేతుల్లోకి చెప్పు తీసుకుని మరీ బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నాం అంటూ మాట్లాడారు.


ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి పదవిని బట్టి స్థాయిని బట్టి మాట్లాడాలని అన్నారు. రైతు బంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామంటున్నారని ఆరోపించారు. ఆటో డ్రైవర్లు తిన్నది అరగక ధర్నాలు చేస్తున్నారని అహంకారంతో మాట్లాడుతున్నారన్నారని అన్నారు. రైతుబంధు కోసం గ‌త ప్రభుత్వంలో విడుద‌ల చేసిన రూ.7,700 కోట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌కి, కాంగ్రెస్ కంట్రాక్ట‌ర్ల‌కి జేబుల్లోకి మలుపుకొని రైతుల నోట్లో మట్టి కొట్టారని ఆరోపణ చేశారు.


కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు అటు కేంద్రంగానీ పక్క రాష్ట్రాల వాళ్ళు కానీ మన ప్రాజెక్టుల వైపు చూడాలంటేనే భయపడ్డారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల అధికారాలన్నీ కేంద్రం చేతుల్లోకి పోయాయని అన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పాల‌న అని విమర్శించారని.. ఒకే పార్లమెంట్ నియోజకవర్గంలో వినోద్, వివేక్ ఎమ్మెల్యేలు అయ్యారని అన్నారు. ఇప్పుడు త‌న కొడుకు వంశీకి ఎంపీ టిక్కెట్టు కోసం ఆశ‌ప‌డ‌టం కుటుంబ పాల‌న కాదా అని ప్రశ్నించారు.


సూటు బూటు వేసుకొని సూట్ కేసు రాజకీయాలతో రాజకీయాలను కలుషితం చేయడానికి కాకా కుటుంబ సభ్యులు మళ్లీ బయలుదేరారని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి పార్లమెంటరీ మొత్తాన్ని సామంత రాజులా వ్యవహరించాలని చూస్తున్నారని బాల్క సుమన్ మాట్లాడారు.