Mallikarjun Kharge Comments on CM KCR: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు అసలు ఇందిరా గాంధీని తిట్టే స్థాయి లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలన కోసం ఇందిరా గాంధీ ఏమీ చేయలేదన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటే అని, వారిద్దరికీ పేదల కష్టాలు పట్టవని మాట్లాడారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే పాల్గొన్నారు.


ఆలంపూర్‌ సభలో మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముగ్గురు తోడు దొంగలేనని విమర్శించారు. దేశంలో ఉన్న మూడు పత్రికలపై బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తోందని అన్నారు. సుమారు 780 కోట్ల ఆస్తులను బీజేపీ ప్రభుత్వం జప్తు చేసిందని అన్నారు. ఈ మూడు పత్రికలు నెహ్రూ సొంత ఆస్తి అని, ఆయన స్థాపించిన ఆ పత్రికలు స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య పాత్ర పోషించాయని ఖర్గే గుర్తు చేశారు.


ఇందిర ఎక్కడ.. కేసీఆర్ ఎక్కడ?
 ‘‘తెలంగాణ ప్రజలు ఇక్కడ కాంగ్రెస్ ను గెలిపించే తీరు భారతదేశం మొత్తం ప్రతిబింబిస్తుంది. దేశంలో హరిత విప్లవం వల్లే ఆహార కొరత తీరింది. హరిత, శ్వేత విప్లవం వచ్చినప్పుడు కేసీఆర్‌ ఎక్కడున్నారు? ఇందిరాగాంధీని విమర్శిస్తున్నావు ఇందిరాగాంధీ ఎక్కడ.. కేసీఆర్ ఎక్కడ.. ఫామ్ హౌస్‌లో కూర్చొని పరిపాలిస్తున్నావు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ లేకపోతే తెలంగాణ ఎడారిలా ఉండేది. దేశంలో ఆహార ధాన్యాల కొరత తీర్చిన ప్రధాని ఇందిరా గాంధీ మాత్రమే. మోదీతో కలిసి నాటకాలు ఆడడమే కేసీఆర్‌కు తెలుసు. తెలంగాణలో అవినీతి బాగా పెరిగిపోయింది. భూమి, ఇసుక, మద్యం కుంభకోణాల్లో సీఎం కేసీఆర్‌ కుటుంబం కూరుకుపోయింది’’ అని ఖర్గే అన్నారు. 


నిరుపేదలను ఆదుకోవడంలో బీజేపీ, బీఆర్ఎస్ నిర్లక్షం చేస్తున్నాయని మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. 2017లో ఇచ్చిన బీఆర్ఎస్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ కోసం అప్పట్లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఉన్న విజయశాంతి ఢిల్లీలో పార్లమెంట్‌లో తెలంగాణ కోసం స్పీకర్ పోడియంలోకి వెళ్లి 4, 5 గంటలు పోట్లాడిందని గుర్తు చేశారు. ఆ సమయంలో నువ్వు ఎక్కడున్నావని కేసీఆర్ ను ప్రశ్నించారు. కేసీఆర్ తో పాటుగా కొడుకు కేటీఆర్, కవిత, అల్లుడు హరీశ్ రావు అందరూ కలిసి తెలంగాణను దోచుకుంటున్నారని అన్నారు. 


ఆలంపూర్ గురించి మాట్లాడుతూ.. ఇది చాలా పవిత్రమైన ప్రాంతం అని అన్నారు. కృష్ణ, తుంగభద్రాల సంగమ ప్రాంతం అని అన్నారు. ’ అని మల్లికార్జున ఖర్గే తెలిపారు.