Maharashtra Car Accident: మహారాష్ట్రలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ కారు  200 మీటర్ల ఎత్తు నుండి లోయలో పడిపోయింది. దాంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు తెలంగాణలోని ఆదిలాబాద్, నల్గొండ జిల్లాకు చెందిన వారు కావడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.


అసలేం జరిగిందంటే..
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అర్లి (టి) గ్రామానికి చెందిన బ్యాంకు ఉద్యోగులు, మరి కొందరు మహారాష్ట్రలో కారులో ప్రయాణిస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు అమరావతి - నాగపూర్ మార్గ మధ్యలో చిక్కల్ దరి అటవీ ప్రాంతంలో 200 మీటర్ల ఎత్తు నుండి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం ఆరుగురు ఉన్నట్టు సమాచారం. 


సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్గం కోసం తరలించినట్లు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న వారు గ్రామీణ బ్యాంకు ఉద్యోగులని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. చనిపోయిన వారు ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల వారు కావడంతో తెలంగాణలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు మృతదేహాను తెలంగాణకు తరలించడానికి రాష్ట్ర పోలీసులు, అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.