కన్న కూతురు బతికుండగానే ఓ తండ్రి చనిపోయిన వారికి చేసినట్లుగా పిండం పెట్టించాడు. అంతేకాక, ఆమెకు దశ దిన కర్మ కూడా జరిపించాడు. కూతురు చనిపోయిందని ఫ్లెక్సీలు ప్రచురించి ఊరు ఊరంతా కట్టించాడు. గుండు గీయించుకొని అన్ని క్రతువులు పూర్తి చేశాడు. కన్న కూతురు బతికి ఉండగానే తండ్రి ఇలా చేయడం పట్ల బంధువులతో పాటు గ్రామస్థులు కూడా ఆశ్చర్యపోయారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కన్న కూతురు బతికి ఉన్నా ఓ తండ్రి గుండు గీయించుకుని.. పెద్ద కర్మలు నిర్వహించడమే కాకుండా ఆమెకు పిండప్రదానం చేశాడు. మహబూబ్ నగర్ జిల్లాలోని చిన్న చింతకుంట మండలంలో ఈ ఘటన జరిగింది. జిల్లాలోని చింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన భార్గవి అనే యువతి అదే గ్రామానికి చెందిని వెంకటేష్ అనే యువకుడిని ప్రేమించింది. వీరు ఇద్దరూ సమీప బంధువులే. వీరి మధ్య క్రమంగా ప్రేమ చిగురించింది.
Also Read: అడగకుండానే ఉద్యోగులకు అన్నీ ఇచ్చి తప్పుచేశామా? ప్రభుత్వ పెద్దల్లో అంతర్మథనం!
పెళ్లి చేసుకోవాలని అనుకొని ఇద్దరూ వారి వారి ఇళ్లలో పెద్దలను ఈ విషయం చెప్పారు. తాము ఇద్దరం ఒకర్నొకరు ప్రేమించుకున్నామని, పెళ్లి చేయాలని కోరారు. అందుకు పెద్దలు ససేమిరా అన్నారు. ఎంత నచ్చచెప్పినా ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతో చేసేది లేక ఎవరికి తెలియకుండా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. జనవరి 13న స్థానికంగా ఓ గుడిలో ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ఈ విషయం యువతి ఇంట్లో తెలిసి ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇంట్లో వారిని కూడా కాదని ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుందని భార్గవి తండ్రి కోపంతో రగిలిపోయాడు. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తన కూతురితో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ పెళ్లితో ఆమె చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా ఆయన తన కూతురు చనిపోయిందంటూ గుండు గీయించుకుని ఆమెకు కర్మకాండలు జరిపించాడు. కూతురి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి అర్పించాడు. కూతురి ప్రేమ వివాహాన్ని భరించలేని తండ్రి చేసిన పని స్థానికంగా చర్చనీయాంశం అయింది.
Also Read: Krishna Patnam Power Plant Problems: ఏపీ ప్రభుత్వం కావాలనే కరెంట్ కోతలు పెడుతోందా? అసలు నిజాలేంటి?