Rahul Gandhi : ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో జోరుగా సాగుతోంది. రాహుల్ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొంటున్నారు. పాదయాత్ర అనంతరం రైతు సంఘాలు, ప్రజా సంఘాలతో రాహుల్ సమావేశాలు నిర్వహిస్తు్న్నారు.  దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని, తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొందని మహబూబ్‌నగర్  జిల్లా  మన్నెం కొండ కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ అన్నారు.  మతం పేరుతో దేశంలో విద్వేషం రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. దేశంలో ప్రజలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ఐక్యతంగా ఉంచేందుకు ఈ పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు. జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన, సహకారం లభిస్తుందని రాహుల్ తెలిపారు. దేశంలో బీజేపీ పాలకుల అసంబద్ధ విధానాలతో అధోగతి పాలు చేస్తున్నారని మండిపడ్డారు.  నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో దేశంలో నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం నెలకొందని ఆరోపించారు. లక్షలాది పరిశ్రమలు మూతపడ్డాయని, కార్మికులు ఉపాధి కోల్పోయారని విమర్శించారు. 


జీఎస్టీ విధానంలో మార్పులు 


"కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో జీఎస్టీ విధానంలో మార్పులు తెస్తాం. రైతులకు అండగా ఉంటున్నాం. గత పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణ మాఫీ చేశాం. ఇప్పుడు కూడా రైతులకు భరోసా ఇస్తున్నాం. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ లు ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నాయి.  వీటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. పాదయాత్ర చేస్తే 6,7 కిలోమీటర్లకు అలసట వస్తాది. కానీ నేను 25 కిలోమీటర్ల పాదయాత్ర చేసినా అలసట రావడం లేదు. మీ ప్రేమ, ఆప్యాయతలతోనే నేను ఎలాంటి అలసట లేకుండా యాత్ర చేయగలుగుతున్నాను. మీ ప్రేమకు ధన్యవాదాలు."- రాహుల్ గాంధీ 


తెలంగాణలో నియంత పాలన 


మహబూబ్‌నగర్  జిల్లా  మన్నెం కొండ కార్నర్ మీటింగ్ రాహుల్ గాంధీ పాల్గొన్నారు.   తెలంగాణలోని అన్నీ వర్గాలతో మాట్లాడి వాళ్ల సమస్యలు తెలుసుకుంటున్నానని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రజల మధ్య ద్వేషం, అహింస సృష్టిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ టీఆర్ఎస్ మధ్య రహస్య బంధాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. పార్లమెంట్ లో అన్నీ విషయాల్లో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు.  హింస ద్వేషాన్ని అంతమోదించటమే జోడో యాత్ర ప్రధాన లక్ష్యమని రాహుల్ తెలిపారు. దేశంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరిందన్నారు. రాష్ట్ర యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో సీఎం లేరని, ఒక  నియంత పాలన నడుస్తోందన్నారు.  ప్రజలను దోచుకోవడమే కేసీఆర్ లక్ష్యమని విమర్శించారు. ప్రతి సాయంత్రం కేసీఆర్ ధరణి పోర్టల్ ను చూస్తారని, భూములు ఎవరెవరు కొనుగోలు చేస్తున్నారు, ఎలా లక్కోవాలనేది చూస్తున్నారని ఆరోపించారు. 


మళ్లీ రైతు రుణ మాఫీ  


"లక్షలాది గిరిజనులకు భూమి హక్కు ఇచ్చింది కాంగ్రెస్.  కానీ కేసీఆర్ మన భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దళితులకు 25 లక్షల ఎకరాలు కాంగ్రెస్ ఇచ్చింది. మన ప్రభుత్వం రాగానే అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తాం. భూమితో పాటు పూర్తి హక్కు వారికిచ్చేలా హామీ ఇస్తున్నాం. నిరుద్యోగానికి ప్రధాన కారణం నోట్ల రద్దు. నోట్ల రద్దు జీఎస్టీ వల్ల చిన్న మధ్య వ్యాపారులకు పెద్ద దెబ్బ. కాంగ్రెస్ సర్కార్ వస్తే జీఎస్టీలో మార్పులు తెస్తాం. దేశ వ్యాప్తంగా ఒకటే జీఎస్టీ అమలుచేస్తాం.  అధికారంలోకి రాగానే మళ్లీ రైతు రుణమాఫీ చేస్తాం. ఈ యాత్రలో హింస, ద్వేషానికి తావు లేదు. మీ అందరి ప్రేమ ఆప్యాయత, మద్దతు వల్ల ఎంత దూరం నడిచినా అలసట లేదు. బీజేపీ టీఆర్ఎస్ రెండు కలిసి పని చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయి."- రాహుల్ గాంధీ