YS Sharmila : వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పై ఫైర్ అయ్యారు. దయాకర్ రావుకు పేరులోనే దయ అని, ఆయనకు అసలు దయే లేదన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గానికి చేరుకుంది. తొర్రూరులో బహిరంగ సభలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ... స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురించి దారిలో వస్తుంటే ఒక పెద్దాయనను మీ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి అని అడిగితే పెద్ద మాట అనేశారన్నారు. ఎక్కడ దయ అమ్మ...ఎక్కడ దయాకర్ రావు అమ్మ..ఈయనకు అసలు దయే లేదన్నారని తెలిపారు. దయాకర్ రావు ఒక క్రూరుడు అని చెప్పారని, దయాకర్ రావు ఒక కబ్జా కోర్ అంటున్నారని ఆరోపించారు.  భూమి కనిపిస్తే పాగా వేస్తారని, చుట్టూ పక్కల భూములు లాక్కుంటారన్నారు. ఇప్పటికే 500 ఎకరాలు పోగు చేసినట్లు స్థానికులు అంటున్నారని విమర్శించారు. ఆయనకు దయ ఉంటే.. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.  దయాకర్ రావు కమీషన్ల కోసం ఆ ప్రాజెక్ట్ లను నిలిపివేశారని ఆరోపించారు.  


వైఎస్ఆర్ విగ్రహం పెడితే పథకాలు బంద్ చేస్తారా? 


"ఎమ్మెల్యే ఆస్తులు గుర్తురులో 200 ఎకరాలు అంట.పామాయిల్ వేశారట. కంటాయిపాలెంలో 300 ఎకరాలు, సన్నురులో 100 ఎకరాలు, పెరికవెడులో 80 ఎకరాలు. ఈ మంత్రికి ఎక్కడ నుంచి వచ్చాయి ఇన్ని ఆస్తులు. ఈ ఎమ్మెల్యే వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా ఆపాలని చూశాడట. అక్కడ మహిళలు రాత్రి అంతా అక్కడ చలిమంట వేసుకొని విగ్రహం కట్టించారు. అయితే విగ్రహాన్ని ఏర్పాటుచేసిన వారి లిస్ట్ తీయమని చెప్పాడట. మండల నాయకులను పిలిపించి వైఎస్సార్ విగ్రహం దగ్గర కూర్చున్న మహిళల వివరాలు అడిగాడట. పెన్షన్లు ఆపమని చెప్పాడట.. దళిత బంధు ఆపుతామని చెప్పాడట. వైఎస్ఆర్ విగ్రహం కావాలని అడిగితే పథకాలు ఆపుతారా?   ఎర్రబెల్లి ఒకప్పుడు తెలుగు దేశం పార్టీ. అభివృద్ధి కోసం కేసీఆర్ దగ్గర చేరాడట. టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ ను బండ బూతులు తిట్టారు. ఎమ్మెల్యేలను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను సంతలో పశువులు లెక్క కొంటున్నారు అన్నారు. కేసీఆర్ కి పరిపాలన చేతకాదని తిట్టారు. అదే కేసీఆర్ కి పశువు లెక్క అమ్ముడుపోయారు" - వైఎస్ షర్మిల 


ఐదో తరగతి ఫెయిల్ మంత్రి 


 ఎర్రబెల్లి దయాకర్ రావు 5th ఫెయిల్ అయ్యారని, 5th ఫెయిల్ అయినోళ్లు మంత్రులు అయి కూర్చున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు. డిగ్రీలు, పీజీలు చదివిన వాళ్లు రోడ్ల మీద తిరగాలి, ఫెయిల్ అయిన వాళ్లు బోగాలు అనుభవించాలి ఇదేనా బీఆర్ఎస్ పాలన అని ఎద్దేవా చేశారు. నాది ఆంధ్ర పార్టీ అని ఎర్రబెల్లి అంటున్నారని, వైఎస్సార్ బిడ్డ తెలంగాణ గడ్డ మీద పుట్టింది, ఇక్కడే పెరిగిందని, ఇక్కడ వ్యక్తినే పెళ్లి చేసుకుందని అన్నారు. తెలంగాణ పేరుతో ఉన్న పార్టీ YSR తెలంగాణ పార్టీ అని స్పష్టం చేశారు. ఆణిముత్యం లాంటి తెలంగాణ పేరును టీఆర్ఎస్ పార్టీ నుంచి తీసేశారన్నారు. బందీపోట్ల రాష్ట్ర సమితి అనే పేరు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.  8 ఏళ్లుగా ప్రతిపక్షాలు తొత్తులుగా మారారన్నారు. లావాదేవీలు చూసుకున్నారని, కేసీఆర్ కు సలాం కొట్టారని విమర్శించారు. కేవలం ప్రజల సమస్యల కోసం  కోట్లాడిన పార్టీ YSR తెలంగాణ పార్టీ అన్నారు. 


బార్ల తెలంగాణ 


"యథా ముఖ్యమంత్రి.. తథా మంత్రులు. రాష్ర్టంలో పరిపాలన పూర్తిగా అటకెక్కింది. ఏ పథకం అమలు కావడం లేదు. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో 3500 పాఠశాలలు బంద్ పెట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు. కేసీఆర్ మంచం కోళ్లు ఎత్తుకు పోయే రకం. బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి అయ్యింది. బంగారు తెలంగాణ అని చెప్పి బార్ల తెలంగాణ చేశారు. వైఎస్ఆర్ ఈ జిల్లాకు దేవాదుల ద్వారా సాగునీరు ఇచ్చారు. ఇదే పాలకుర్తి నియోజకవర్గంలో రెండు రిజర్వాయర్లు వైఎస్సార్ కట్టించేందుకు నిధులు విడుదల చేశారు. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ ల పనులు వైఎస్సార్ హయంలోనే సగం పూర్తి అయ్యాయి. ఇవ్వాళ్టి వరకు ఆ ప్రాజెక్ట్ లు పూర్తి చేయలేదు. దేవాదుల గ్రావిటీ కెనాల్ ద్వారా ఇక్కడ చెరువులు అన్ని నింపారు. " - వైఎస్ షర్మిల