LB Nagar : కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల పంచాయతీ ప్రారంభమయింది. టిక్కెట్ల దరఖాస్తు ప్రక్రియ పూర్తి కావడంతో ఎవరెవరు ఎక్కడెక్కడ టిక్కెట్లు ఆశిస్తున్నారో క్లారిటీ వచ్చింది. దీంతో ఒకరిపై ఒకరు రాజకీయాలు ప్రారంభించుకున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ రాజకీయం గోడలకు ఎక్కింది.
ఎల్పీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి కాంగ్రె్స ప్రచార కమిటీ కమిటీ చైర్మన మధుయాష్కీ గౌడ్ దరఖాస్తు చేసుకున్నారు. ఆయన స్థానికుడు కాదు. ఎల్బీనగర్ నియోజకవర్గ రాజకీయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. అయితే హఠాత్తుగా ఆయన ఎల్బీనగర్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం .. ఎల్బీనగర్ నియోజకవర్గ నేతల్లో కలకలం రేపింది. దీంతో ఆయనకు వ్యతిరేకంగా గాంధీభవన్‌లో పోస్టర్లు వేశారు. పారాచూట్ నాయకులకు టికెట్ ఇవ్వొద్దంటూ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. సేవ్ ఎల్బీనగర్ కాంగ్రెస్ .. , మధు యాష్కి గో బ్యాక్ టు నిజామాబాద్ అంటూ పోస్టర్లు వెలిశాయి.
2009 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించిన మధుయాష్కి.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఓటమి చవిచూశారు. దీంతో ఆయన ఈసారి పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా నుంచి కాకుండా.. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తామని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రముఖ బీసీ నేతగా ఉన్న తనకు అడిగిన చోట టిక్కెట్ ఖరారు చేస్తారని మధుయాష్కీ ఆశలు పెట్టుకున్నారు.
అయితే ఎల్బీ నగర్‌లో స్థానిక నేతలైన మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సోదరుడు, మరో నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి సైతం అభ్యర్థిత్వం కోసం అప్లయ్ చేసుకున్నారు. లింగోజి గూడ నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్ గా గెలిచిన దర్పల్లి రాజశేఖర్ రెడ్డి కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. దీంతో టిక్కెట్ పోటీ తీవ్రమయింది. కష్టకాలంలో కూడా నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ వస్తున్న తమకు కాకుండా మరొకరికి టికెట్ ఇస్తారేమోనని అక్కడి నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో యాష్కికి వ్యతిరేకంగా గాంధీ భవన్‌లో పోస్టర్లు వెలిసినట్లుగా తెలుస్తోంది.
ఈ అంశంపై మధుయాష్కీ ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఆయన ఎల్పీనగర్ కోసం ఎలాంటి కృషి చేయలేదని.. ఆయనకు టిక్కెట్ ఎందుకివ్వాలన్న వాయిస్ లు పెరుగుతూండటంతో మధుయాష్కీకి ఇబ్బందికరంగానే మారింది.