Breaking News: విజయవాడ: రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యం అరెస్టు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 23 Aug 2021 08:53 PM
విజయవాడ: రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యం అరెస్టు

బెజవాడలో సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యాన్ని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ విజయవాడలో హత్యకు గురైన విషయం తెలిసిందే. అతని మృతదేహం కారులో పడి ఉంది. ఆ మృతదేహాన్ని రాహుల్ దిగా గుర్తించిన తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు బెంగళూరులో కోగంటి సత్యాన్ని అరెస్టు చేశారు.

బీసీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ గా వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్ రావు

బీసీ మిష‌న్ ఛైర్మన్ గా వ‌కుళాభ‌ర‌ణం కృష్ణమోహన్ రావును నియ‌మిస్తూ రాష్ట్ర  ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ప్రభుత్వం శుభప్రద్ పటేల్, కిశోర్ గౌడ్, సీహెచ్ ఉపేంద్ర కమిషన్ లో సభ్యులుగా నియమించింది. బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ క‌మీష‌న్ సభ్యుల హోదాలతో సమానంగా స‌దుపాయాలు ఉంటాయి.

School Re Open: తెలంగాణలో మోగనున్న బడి గంట.. సెప్టెంబర్‌ ఒకటి నుంచి ఆఫ్‌లైన్ బోధన స్టార్ట్.. ఎవరెవరికి అంటే?

తెలంగాణలో బడిగంట సెప్టెంబర్‌ ఒకటి నుంచి మోగనుంది. కరోనా నిబంధనలు పాటిస్తూనే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. థర్డ్‌ వేవ్‌తో ప్రమాదం లేదంటున్న వైద్యుల సూచనలతో విద్యాశాఖాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ఎనిమిదో తరగతి నుంచి పీజీ వరకు ఆఫ్‌లైన్‌ తరగతుల నిర్వహణకు అంతా రెడీ చేశారు. ఉత్తర్వులు కూడా విద్యాశాఖ జారీ చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యక్ష తరగతులు ఆగస్టు 16నుంచి ప్రారంభమయ్యాయి. 

వెలిగొండ ప్రాజెక్ట్ పనులను నిలిపివేయించాలి..కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ

వెలిగొండ ప్రాజెక్ట్ పనులను నిలిపివేయించాలని కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు రాష్ట్ర ఈఎన్‌సీ లేఖ రాశారు. తాగునీటి కోసం వినియోగించే జలాలు 20 శాతం మాత్రమే లెక్కించాలని లేఖలో పేర్కొన్నారు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం 20 శాతంగానే లెక్కించాలని తెలిపారు. ఈ మేరకు వెలిగొండ ప్రాజెక్ట్ పనులను నిలిపివేయించాలని కేఆర్‌ఎంబీ ఛైర్మన్ కు తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు.

Telangana EMCET: 25న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు!

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నహాలు చేస్తోంది. బుధవారం విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్ అడ్మిషన్ ప్రక్రియలో ఇంటర్ వెయిటేజ్‌ అందుకే వీలైనంత త్వరగా ఫలితాలు రిలీజ్‌ చేసి అడ్మిషన్లు జరిపించాలని చూస్తున్నారు. గతంలో ఇంటర్‌లో 45 శాతం మార్కులు ఉంటేనే అడ్మిషన్‌కి అర్హత ఉండేది. కరోనా ఉద్ధృతి కారణంగా ఇంటర్ పరీక్షలు జరగలేదు. దీంతో ఎంసెట్‌లో క్వాలిఫై అయితే చాలు సీటు వచ్చే అవకాశం ఉంది. 

Etela Rajendra: ఈటల పర్యటనలో ఫొటోలు తీసిన ఏఎస్‌ఐ.. తిరగబడ్డ బీజేపీ శ్రేణులు

కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం వల్బాపూర్‌లో మాజీ మంత్రి ఈటల పర్యటనలో వివాదం చోటు చేసుకుంది. ఓ ఏఎస్‌ఐ ఫొటోలు తీయడం వివాదానికి దారి తీసింది. ఈటల సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఐ ఫొటోలు తీశాడు. దీన్ని గమనించిన బీజేపీ శ్రేణులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది. దీంతో ఏఎస్‌ఐ చొక్కా చనిగిపోయింది. ఏఎస్‌ఐ ఎవరి ఆదేశాలతో ఫొటోలు తీశారని..దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. 

బల్లి పడిన ఆహారం తిని 27 మంది విద్యార్థులకు అస్వస్థత

విజయనగరం జిల్లాలో బల్లి పడిన ఆహారం తిని 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పార్వతీపురం పురపాలక పాఠశాలలో ఆహారంలో బల్లిపడింది. అస్వస్థతకు గురైన విద్యార్థులను  పాఠశాల సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.

Srikakulam Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆర్మీ జవాన్‌ అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా నలుగురు మృతి

శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్ అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పలాస మండలం సుమ్మదేవి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు మృతి చెందారు. ఆర్మీ జవాను మృతదేహానికి ఎస్కార్టుగా బొలెరో వాహనంపై వెళ్తుండగా రైల్వే ట్రాక్ సమీపంలో వాహనం టైరు పేలింది. ఈ కారణంగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎచ్చెర్లకు చెందిన నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు అక్కడికక్కడే చనిపోయారు.

ఎవరి పని తీరు బాగుందో చెప్పండి కిషన్ రెడ్డి గారూ..

‘‘తలసరి ఆదాయం విషయంలో దేశ వృద్ధి రేటు గత ఆరేళ్లలో 48.7 శాతంగా ఉంది. తెలంగాణ విషయంలో అది 91.5 శాతంగా ఉంది. దేశంలోనే తలసరి ఆదాయం వృద్ధి రేటులో మనమే రెండో స్థానంలో ఉన్నాం. కాబట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటి వారు ఎవరి పనితీరు బాగుందో చెప్పాలి’’ అని కేంద్ర మంత్రిని హరీశ్ రావు ప్రశ్నించారు.

దేశం కన్నా తెలంగాణ తలసరి ఆదాయమే ఎక్కువ

‘‘తెలంగాణ తలసరి ఆదాయం విషయంలో 2020-21 ఏడాదికి గానూ రూ.2,37,632 గా ఉంది. జాతీయ సరాసరి తలసరి ఆదాయంతో పోల్చితే 1.84 రెట్లు ముందున్నాం. దేశ తలసరి ఆదాయం రూ.1,28,829 గా ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,37,632 గా ఉంది. దేశ తలసరి ఆదాయం కంటే ఎక్కువగా ఉంది. దేశంలోనే మూడో అతిపెద్ద తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉంది. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 10వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు దేశంలోనే మూడో స్థానంలోకి వచ్చింది.’’ అని హరీశ్ రావు తెలిపారు.

దక్షిణ భారతంలో మనమే నెంబర్ 1

‘‘దక్షిణ భారతంలోని రాష్ట్రాలతో తెలంగాణను పోల్చి చూస్తే జీఎస్డీపీ వృద్ధి రేటులో మనమే నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. గత 6 సంవత్సరాల్లో ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలను పోల్చి చూస్తే సరాసరిన 11.7 శాతం వృద్ధి రేటు నమోదు చేశాం. ఏపీ 11.2 శాతం, కర్ణాటక 10.6, కేరళ 10.8, తమిళనాడు 10.1 శాతంగా ఉన్నాయి.’’ అని హరీశ్ రావు తెలిపారు.

బంగ్లాదేశ్ కన్నా తక్కువగా దేశ వృద్ధి రేటు

‘‘బంగ్లాదేశ్‌తో పోల్చి చూస్తే కూడా భారత దేశ జీడీపీ వృద్ధి రేటు తక్కువగా ఉంది. 2014-15 నుంచి భారత వృద్ధి రేటు తగ్గుతుండగా.. బంగ్లాదేశ్ వృద్ధిరేటు పెరుగుతూ పోయింది. అంటే భారత దేశ ఆర్థిక పరిస్థితి బంగ్లాదేశ్ కన్నా పడిపోయింది. ఇది మీ ప్రభుత్వం సాధించిన పురోగతి’’ అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

తెలంగాణ ఆర్థిక పరిస్థితులపై మాట్లాడుతున్న హరీశ్ రావు

తెలంగాణ ఆర్థిక పరిస్థితులపై మంత్రి హరీశ్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ 11వ పెద్ద రాష్ట్రమని, తలసరి ఆదాయంలో తెలంగాణ అత్యధిక వార్షిక వృద్ధి రేటు నమోదైందని అన్నారు. రాష్ట్రం వచ్చిన ఏడేళ్లలో తెలంగాణ ఏడు రాష్ట్రాలను అధిగమించిందని అన్నారు. 

మోదీతో ముగిసిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ భేటీ

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వంలో అఖిలపక్ష నాయకులు ప్రధాని మోదీని కలిశారు. బిహార్‌లో కులాల వారీ గణన గురించిన అంశాలను ప్రధానికి వివరించినట్లుగా నితీశ్ కుమార్ వివరించారు. అఖిలపక్ష నేతలు చెప్పిన వివరాలను ప్రధాని సావధానంగా విన్నారని తెలిపారు. కులాల వారీ గణన విషయంలో గతంలో రెండుసార్లు బిహార్ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపామని నితీశ్ అన్నారు.

పెదపాలపర్రు ప్రభుత్వ పాఠశాలలో 10 మంది విద్యార్థులకు కరోనా

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలపై కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నివేదిక అందుతున్న సమయంలో చిన్నారులపై వైరస్ ప్రభావం పెరుగుతోంది. ఏపీలో బడులు మొదలైన తరుణంలో వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. తాజాగా కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ కలకలం సృష్టించింది. జిల్లా పరిషత్ పాఠశాలల్లో నిర్వహించిన కరోనా పరీక్షల్లో  13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్  వచ్చింది. పెదపాలపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనే 10 మంది విద్యార్థులకు కరోనా సోకింది. అదే విధంగా మరో పాఠశాలలోని ముగ్గురు విద్యార్థులకు సైతం కరోనా సోకింది. అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

కార్వీ పార్థసారథిపై మరో కేసు

ఇప్పటికే రెండు కేసుల్లో చిక్కుకున్న కార్వీ మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథిపై మరో కేసు నమోదైంది. సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులకు ఐసీఐసీఐ బ్యాంకు ఈ ఫిర్యాదు చేసింది. దీంతో కార్వీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. 

అమరావతి వ్యాజ్యాలపై విచారణ వాయిదా

పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ వాయిదా పడింది. నవంబరు 15కి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు సీజే ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. రోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విచారణ వాయిదా వేయాలని పిటిషనర్లు, వాళ్ల తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. దేశంలో, రాష్ట్రంలో నమోదవుతున్న కేసులను పరిగణనలోకి తీసుకుని సీజే ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

మధుసూధన్ హత్య కేసులో పురోగతి

హైదరాబాద్‌కు చెందిన మధుసూధన్ హత్య కేసులో కీలక విషయాలను పోలీసులు రాబట్టారు. గంజాయి మాఫియా కారణంగానే మధుసూధన్ రెడ్డిని హత్య చేసినట్లుగా నిర్ధారణ అయింది. గంజాయి వ్యాపారం చేసే సంజయ్‌తో మధుసూధన్ రెడ్డికి గతంలోనే పరిచయం ఏర్పడగా.. అతనే మధుసూధన్ రెడ్డిని ఈ వ్యాపారంలోకి దింపాడు. ఈ క్రమంలో మధుసూధన్‌తో సంజయ్ రూ.40 లక్షలకు గంజాయి ఒప్పందం మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సంజయ్ గంజాయి ఇవ్వకపోవడంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా ఆ విషయంలో వివాదం చెలరేగింది. బీదర్‌లో డబ్బులు ఇస్తానని నమ్మించి మధుసూధన్ రెడ్డి తీసుకెళ్లిన సంజయ్.. పాతబస్తీ పరిసరాల్లో హత్య చేసినట్లు గుర్తించారు.

రేపు టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. మంగళవారం తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ కమిటీ సమావేశం అవుతుంది. పార్టీ అంతర్గత అంశాలతో పాటు, హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర, గ్రామ, మండల శాఖల పునర్నిర్మాణంపై చర్చ జరగడంతో పాటు వాటి తేదీలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన పద్దతి, తీసుకోవాల్సిన చర్యల గురించి, పార్టీ చేయాల్సిన కృషిపై చర్చించనున్నారు. 

హైదరాబాద్‌లో ప్రారంభమైన వ్యాక్సిన్ డ్రైవ్

జీహెచ్ఎంసీ పరిధిలో స్పెషల్‌ కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభమైంది. వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్‌ఎంసీ, కంటోన్మెంట్‌ బోర్డులు సంయుక్తంగా ఈ డ్రైవ్‌ను చేపట్టాయి. పెద్ద ఎత్తున జరగనున్న ఈ ప్రక్రియ ద్వారా 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇప్పటికే మొబైల్ వ్యాక్సిన్ సెంటర్లు ఆయా కాలనీలకు వెళ్లాయి. ఇంటింటికీ తిరుగుతూ స్పెషల్ కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ స్లిప్‌లను అధికారులు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని 4,846 కాలనీలు, బస్తీలతో పాటు కంటోన్మెంట్‌లోని 360 బస్తీలు, కాలనీల్లో డ్రైవ్‌ కొనసాగుతోంది.

దేశంలో కొత్తగా 25 వేల కరోనా కేసులు, 389 మరణాలు

దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గింది. తాజాగా కొత్త కేసులు 25 వేలకు చేరాయి. సుమారు ఐదు నెలల కనిష్ఠానికి కేసుల సంఖ్య తగ్గింది. సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాలు ఇలా ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో  25,072 మందికి పాజిటివ్ వచ్చింది. 389 మంది మరణించారు. మొత్తం కరోనా కేసులు 3.24 కోట్లకు చేరాయి. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,34,756గా ఉంది. ఆదివారం 44,157 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,33,924 మంది కరోనాతో బాధపడుతున్నారు. 

గాంధీలో చికిత్స పొందిన మంత్రి కిషన్ రెడ్డి

గాంధీ ఆస్పత్రిని పరిశీలించిన మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల తన తలకు అయిన గాయానికి అదే ఆస్పత్రిలో చికిత్స పొందారు. అనంతరం గాంధీ సూపరింటెండెంట్ రాజారావు కిషన్ రెడ్డిని సన్మానించారు. దేశ వ్యాప్తంగా 58 కోట్ల వరకూ వ్యాక్సిన్లు అందించాం. తెలంగాణలో ఇప్పటిదాకా కోటి 68 లక్షల 61 వేల 809 డోసులను కేంద్రం తెలంగాణకు పంపిందని గుర్తు చేశారు. సుమారు 13 లక్షల 18 వేల వ్యాక్సిన్‌లు ఇంకా ఆస్పత్రుల్లో నిల్వ ఉందని వివరించారు. కాబట్టి కొరత ఉందంటూ ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. గిరిజన, మారుమూల ప్రాంతాల వారికి కూడా వ్యాక్సిన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు.

గాంధీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలోని కరోనా వార్డు సహా సాధారణ వార్డులనూ కిషన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి అక్కడి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆక్సీజన్ ప్లాంట్‌ను పరిశీలించారు. దాని పని తీరును అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.





దళిత బంధు కోసం మరో రూ.500 కోట్లు విడుదల

దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ.500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం రూ.2 వేల కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన రూ.500 కోట్లతో పాటు తాజాగా విడుదల చేసిన రూ.500 కోట్లు కలిపి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పైలట్ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.వెయ్యి కోట్ల నిధులు విడుదలయ్యాయి. కాగా, వారం రోజుల్లోపు మరో రూ.వెయ్యి కోట్లను ప్రభుత్వం విడుదల చేయనున్నది. దాంతో సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.2 వేల కోట్ల నిధులు పూర్తి స్థాయిలో విడుదల అవుతాయి.

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కూలిన గోడ

గుంటూరు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఒక్కసారిగా గోడ కూలింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల గోడ కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో భక్తులు లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. 

తిరుగుబాటుదారుల చేతుల్లో 300 మంది తాలిబన్లు హతం!

అఫ్గాన్ తాలిబన్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంజ్ షిర్ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు వెళ్లిన తాలిబన్లపై తిరుగుబాటుదారులు విరుచుకుపడ్డారు.  వీరి మధ్య జరిగిన పోరులో 300 మంది తాలిబన్లు చనిపోయినట్లు సమాచారం. తాలిబన్ల కమాండ్ తిరుగుబాటు దారుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. 

పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తూ పెళ్లికొడుకు మృతి

త్వరలో పెళ్లి కావాల్సిన ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి పత్రికలు పంచేందుకు బైక్​పై వెళుతుండగా ప్రమాదం జరిగి ఓ యువకుడు మృతి చెందాడు. అనంతపురం జిల్లా కదిరి మండలం ఎరుకులవాండ్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కదిరి మండలం ఎర్రదొడ్డికి చెందిన మహేశ్‌ (26) మృతి చెందాడు. ఈ నెల 27న మహేష్ వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పత్రికలు పంచేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Background

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. ఈ నెల 24 నుంచి ప్రారభించాల్సిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను ఈ నెల 28న ఆయన ప్రారంభించనున్నారు. బీజేపీ సీనియర్‌నేత, యూపీ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ మృతిచెందడం వల్ల పార్టీ పరంగా సంతాపదినాలు పాటిస్తుందని, ఆ కారణంగానే పాదయాత్రను వాయిదా వేసినట్లు బీజేపీ అధికారికంగా వెల్లడించింది. తొలుత ఈ పాదయాత్రను క్విట్‌ ఇండియా దినోత్సవం ఆగస్ట్‌ 9 నుంచి మొదలుపెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ, అదే సమయంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడం, కీలక బిల్లులపై చర్చ వంటి అంశాల నేపథ్యంలో ప్రజా సంగ్రామ యాత్రను 24కు వాయిదా వేశారు. తాజాగా కల్యాణ్‌సింగ్‌ మరణంతో మరో నాలుగు రోజుల పాటు పాదయాత్ర వాయిదా పడింది.


Also Read: Sangareddy: రాఖీ కట్టించుకోనని మొండికేసిన అన్న.. చెల్లెలు అఘాయిత్యం, కాలనీలో షాకింగ్ ఘటన

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.