తెలంగాణలో మందుబాబులకు షాకింగ్ న్యూస్. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులు వైన్స్ షాపులు బంద్ కానున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 28 నుంచి 30 వరకూ అన్ని బార్లు, మద్యం దుకాణాలు మూసివేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి బార్ల యజమానులకు సంబంధిత అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వాలని, ఆ 3 రోజులూ రాష్ట్రంలో ఎక్కడా కూడా మద్యం అందుబాటులో లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. మళ్లీ డిసెంబర్ 1న మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. 


ప్రలోభాలకు తెర


తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుండగా సభలు, ర్యాలీలతో ప్రధాన పార్టీల నేతలు హోరెత్తిస్తున్నారు. శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, తమ అభిమానులకు నేతలు మద్యం కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ప్రచారాలతో పాటు ప్రలోభాలకు కూడా తెర లేచే అవకాశం ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు భావిస్తున్నారు. పోలింగ్ సమయంలో మద్యం సరఫరా పూర్తిగా నిలువరించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలతో అక్రమ మద్యం, నగదును సీజ్ చేస్తూ పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ఎన్నికల టైంలో లిక్కర్ సేల్స్ ఎక్కువైనా, వైన్ షాపులు, బార్లకు వెళ్లే సంఖ్య మాత్రం చాలా తక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నారు.


ఫిర్యాదు చేయండిలా


ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కానీ, అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తులు కానీ తమ పార్టీకే ఓటెయ్యాలని బెదిరించినా, మద్యం, డబ్బు, బహుమతులు పంపిణీ చేసినా, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినా సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. సంబంధిత వీడియోలు, ఫోటోలు, తీసి యాప్ లో అప్లోడ్ చేస్తే, వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


నామినేషన్ల జోరు


తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి.  ఈ నెల 10 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుండగా, ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 15 వరకూ నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. అటు, ప్రచారంలోనూ రాజకీయ పార్టీలు ముందున్నాయి. సోషల్ మీడియా, ర్యాలీలు, బహిరంగ సభలతో దూసుకెళ్తున్నారు.


నామినేషన్ల నింబధనలివే





  • ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజకవర్గం నుంచి గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చెయ్యొచ్చు. గుర్తింపు పొందిన రాష్ట్ర లేదా జాతీయ పార్టీ అభ్యర్థి కోసం అదే నియోజకవర్గంలో ఒక ఓటరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. గుర్తింపు లేని పార్టీ అభ్యర్థి లేదా స్వతంత్ర అభ్యర్థి కోసం అదే నియోజకవార్గంలో 10 మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది. 

  • ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా వర్గాలకు చెందిన వారై ఉండాలి. ఈ క్రమంలో నామినేషన్ దాఖలు సమయంలో కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. సెక్యూరిటీ డిపాజిట్ కోసం జనరల్ అభ్యర్థులు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు చెల్లించాలి. ఒక్కో అభ్యర్థి పేరు మీద కేవలం ఒక అకౌంట్ మాత్రమే ఉండాలి.

  • నామినేషన్ దాఖలు చేసే సమయంలో నోటరీ చేసిన అఫిడవిట్ సమర్పించాలి. అందులో అభ్యర్థి వివరాలు, ఆస్తి వివరాలు పూర్తిగా ఉండాలి. అభ్యర్థి వెంట రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసేటప్పుడు అధికారి కార్యాలయానికి 100 మీటర్ల లోపే ఊరేగింపు ఆపెయ్యాలి. నిబంధనల మేర అభ్యర్థి ప్రవర్తించకుంటే నామినేషన్ తిరస్కరించే అవకాశం ఉంటుంది.




Also Read: కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు ఖరారు - ఆ సీటుతో పాటు మరో ఆఫర్