Rains In Telangana And Hyderabad : మండుతున్న ఎండల నుంచి తెలంగాణ(Telangana) రాష్ట్రంలో కాస్త ఉపశమనం కలిగింది. ఉరుములతో కూడిన వర్షం కురవడంతో వాతావరణం(Weather) చల్లబడి ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్‌లోనూ(Hyderabad) చిరుజల్లులు కురవడంతో తెల్లవారుతుండగానే ప్రజలు హమ్మయ్యా అంటూ ఉపశమనం పొందారు. తెలంగాణ వ్యాప్తంగా ఐదురోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీనివల్ల ఉష్ణోగ్రతలు(Temperature) కొంతమేర తగ్గే అవకాశం ఉంది.


వాన కబురు
తెలంగాణ(Telangana) వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది.మంగళ, బుధవారాల్లో దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను(Orange Alert) జారీ చేసింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో  ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగగా.. దక్షిణ తెలంగాణ మాత్రం కాస్తంత చల్లబడింది. ఇప్పటి వరకు 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఇప్పుడు కొంచెం దిగొచ్చాయి. నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. రానున్న ఐదురోజులపాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణశాఖ హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాలకు  ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. 


తగ్గిన ఉష్ణోగ్రతలు
మార్చి మధ్యలో నుంచే నిప్పుుల కురిపిస్తున్న భానుడి దెబ్బకు ఉడికిపోతున్న తెలంగాణలో వర్షాలు కురవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.  ఆది, సోమవారాల్లో కురిసిన వానతో వాతావరణం కాస్త చల్లబడింది. కొన్నిచోట్ల వడగండ్ల వాన కురిసింది. అత్యధికంగా నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలలో 6.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో 4.7 సెంటీమీటర్ల వర్షం పడింది.  సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెంలో 3.5 మి.మీ, నల్లగొండ జిల్లా గుండ్లపల్లి మండలం సింగరాజ్‌పల్లిలో 3.3 మి.మీ, ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం రావినూతలలో 2.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది.


భాగ్యనగరంలో వర్షం
మండతున్న ఎండల నుంచి చిరుజల్లులు  హైదరాబాద్(Hyderabad) నగరవాసులకు  కొంచె ఉపశమనం కలిగించాయి. సోమవారం సాయంత్రం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. మంగళవారం ఉదయం కూడా వాతావరణం చల్లబడటంతోపాటు  వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచే తేలికపాటు జల్లులు కురుస్తున్నాయి. ఉద్యోగాలకు వెళ్లే వారికి కొంత ఇబ్బంది తలెత్తినా....వాతావరణం(Weather) చల్లబడటంతో అందరూ హ్యాపీగా ఫీలవుతున్నారు.


కొన్నిచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు
ఒకవైపు వర్షాలు  కురుస్తున్నా....మరోవైపు అధిక ఉష్ణోగ్రతలు(Temperature) నమోదవుతూనే ఉన్నాయి. జగిత్యాల జిల్లా గుల్లకోట, అల్లీపూర్‌లో అత్యధికంగా  46.8 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.4, సుగ్లాంపల్లి, జగిత్యాల జిల్లా కోల్వాయిలో46.3, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో 46.2, జగిత్యాల జిల్లా గోదూరులో 46.1, కుమ్రంభీం జిల్లా తిర్యాణీ, మంచిర్యాల జిల్లా నస్‌పూర్‌లో 46, వెల్గనూర్‌లో 45.9 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెలలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వృద్ధులు, చిన్నారులు ఎండలకు అల్లాడిపోతున్నారు.