YSRTP : తెలంగాణ అంశంతో వైఎస్సార్టీపీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని పెట్టి కార్యకర్తలను నమ్మించి మోసం చేసిన షర్మిల వెంటనే తెలంగాణ విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆ పార్టీ నేతలు గో బ్యాక్ అని డిమాండ్ చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకుని కాంగ్రెస్‌కు  మద్దతు ప్రకటించడంపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు.  ఇంతకాలం ఆమెను నమ్మి ఆమె వెనక నడిచి సపోర్టు చేసినందుకు సిగ్గుగా ఉన్నదని, ప్రజలకు క్షమాపణలు చెప్పారు.  ఇప్పుడు వైఎస్సార్టీపీకి రాజీనామా చేసినందున ఆమెను తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నామన్నారు. ఆమె రాజకీయాలకు పనికిరాని వ్యక్తి అని, తెలంగాణ పట్ల ఆమెకు చిన్నచూపు ఉన్నదన్నారు. తమ భవిష్యత్ కార్యచరణను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. 


మహిళలకు ప్రాధాన్యతిస్తామంటే పార్టీలో చేరానని, ఆమెతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నానని, కానీ ఆమె తన సొంత ఎజెండాను పెట్టుకున్నారని, భవిష్యత్తులో ఆమె ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామన్నారు. ఆంధ్ర స్థానికత కలిగిన షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మూకుమ్మడిగా ఆ పార్టీ నుంచి రాజీనామా చేసిన నేతలు ఆమెకు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చారు. గట్టు రామచంద్రరావు, సత్యవతి, సంజీవరావు, గణేశ్ నాయక్ తదితరులంతా సామూహికంగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్‌కు తెలంగాణ ప్రాంతంలో ఉన్న మంచి పేరును ఆమె చెడగొట్టారని ఆరోపించారు. పార్టీ నుంచి రాజీనామా చేయడానికి దారితీసిన కారణాలను మీడియాకు వివరించారు. 


బయ్యారం గుట్టను దోచుకోవడానికి వచ్చిన షర్మిలా ఖబడ్దార్.. అంటూ ఆమెకు గణేశ్ నాయక్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ సొమ్ము దోచుకోడానికే ఆమె ఇక్కడకు వచ్చారని, ఇప్పుడు ఎన్నికల బరి నుంచి తప్పుకున్న ఆమెను భవిష్యత్తులో ఎక్కడ పోటీ చేసినా రాళ్ళతో కొట్టి ఆంధ్రకు పంపిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ద్రోహిగా ఆమెకు తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఇకపైన ఆమెకు తెలంగాణలో తిరిగే హక్కే లేదన్నారు. గట్టు  రామచంద్రరావు సహా పలువురు నేతలు ఈ సమావేశంలో  పాల్గొన్నారు. 


ఓట్లు చీలకూడదన్న ఉద్దేశంతో  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీకి చెందిన మఖ్య నేతలతో  సమావేశమై.. కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో పార్టీని కాంగ్రెస్‌లో  విలీనం అని ఢిల్లీ, బెంగళూరు వేదికగా పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ చివరికి ఎందుకు ఆ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో ఒంటరిగా పోటీచేయాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది కానీ.. ఇంతలో ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. సడన్‌గా కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని షర్మిల నిర్ణయించారు. ఈ ప్రకటన చేసిన రోజుల వ్యవధిలోనే వైఎస్సార్టీపీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీకి పలువురు కీలక నేతలు, ద్వితియ శ్రేణి నేతలు మూకుమ్మడిగా రాజీమా చేశారు. ఈ మేరకు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో సీనియర్ నేత గట్టు రామచంద్రరావు నేతృత్వంలో రాజీనామాలు చేసి విమర్శలు గుప్పించారు.