Telangana Left Parties :  బిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ మిత్ర ధ‌ర్మం మ‌రిచి మోసం చేశార‌ని తెలంగాణ కమ్యూనిస్టు పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో రెండు పార్టీల నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన  తెలంగాణ  సీపీఐ ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు  రాజ‌కీయాల‌లో మోసం చేసే వారు, మోసపోయేవాళ్లు ఉంటారని వ్యాఖ్యానించారు .  మునుగోడులో బీజేపీని ఓడించేందుకే తాము బీఆర్ఎస్‌కు మద్దతిచ్చామన్నారు. కలిసి ఉందామని కేసీఆర్ చెప్పారని, కానీ ఆ తర్వాత ఇప్పుడు లెక్క ఎందుకు మారిందో ఆయనే చెప్పాలన్నారు. మునుగోడులో మద్దతివ్వడం తమ తప్పు కాదన్నారు. కేసీఆర్‌ను తాము నమ్మడం కాదని, ఆయన తమను అవసరానికి వాడుకున్నార‌ని తీవ్ర విమర్శలు చేసారు. 

అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పని చేద్దామని  కేసీఆర్ తమతో రెండుమూడుసార్లు మాట్లాడారని, కానీ సీట్ల ప్రకటన సమయంలో తమకు కనీసం సమాచారం ఇవ్వలేదన్నారు. బిఆర్ ఎస్ తో పొత్తుల కోసం తాము ఎప్పుడూ వెంపర్లాడలేదని కమ్యూనిస్టు పార్టీల నేతలు చెబుతున్నారు.  సీపీఎం, సీపీఐ.. రెండు కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు.  తమతో ఎవరైనా కలిసి వస్తే పోటీకి సిద్ధమని..లేదంటే కమ్యూనిస్టు పార్టీలు కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి.  సాధ్య‌మైన‌న్ని ఎక్కువ స్థానాల‌లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.  వామ‌ప‌క్షాల‌కు స‌గంపైగా సీట్ల‌లో ప్ర‌భావం చూపే ఓటు బ్యాంకు ఉందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు.  మునుగోడు  ఉపఎన్నికల సమయంలో కమ్యూనిస్టులతో కేసీఆర్ పొత్తులు పెట్టుకున్నారు. ఆ పార్టీకి ఆ నియోజకవర్గంలో సాలిడ్ ఓటు బ్యాంక్ ఉండటంతో  కమ్యూనిస్టు నేతల్ని ప్రగతి భవన్‌కు  పిలిపించి చర్చలు జరిపారు. కమ్యూనిస్టుపార్టీల జాతీయ నేతల్ని కూడా ప్రగతి భవన్‌కు  పిలిచారు. జాతీయ రాజకీయాల్లోనూ కలిసి చేయాలని నిర్ణయించుకున్నారు. మునుగోడులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో..  కమ్యూనిస్టులతో బంధం ఈ ఒక్క ఉపఎన్నికతో ఆగని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత కమ్యూనిస్టులతో కమ్యూనికేషన్ ను కేసీఆర్ నిలిపివేశారు. ఈ అంశంపై కమ్యూనిస్టుపార్టీ నేతలు కనీ సం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని.. అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. 

మారిన రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టులతో పొత్తు  వద్దని కేసీఆర్ అనుకున్నారని జాబితాను బట్టి స్పష్టయింది.   మునుగోడు ఉప ఎన్నికల్లో ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్య అధినేత కేసీఆర్‌ నుంచి పిలుపును అందుకున్నారని గులాబీ వర్గాలు తెలుపుతున్నాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందడం వెనుక సీపీఐ, సీపీఎం ఓట్లే కారణమన్న అభిప్రాయాన్ని అన్ని పార్టీల నేతలు వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సైతం తన ఓటమికి ప్రధాన కారణం కమ్యూనిస్టులే అని బహిరంగంగా ప్రకటించారు. అయితే  సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకుంటే.. చెరో రెండు, మూడు సీట్లు అయినా ఇవ్వాల్సి వస్తుందని..  ఆ సీట్లు త్యాగం చేయడం కష్టమని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా కమ్యూనిస్టు పార్టీలు కేసీఆర్ చేతిలో మోసపోయామని మండిపడుతున్నారు.