Formula E Car Race Case Chargesheet A1 KTR: తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా తీవ్ర దుమారం రేపుతున్న ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం  ఉదయం 10:15 గంటలకు హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ముందుకు స్వయంగా హాజరుకానున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ ప్రత్యేక కోర్టు గతంలోనే కేటీఆర్‌తో పాటు ప్రధాన నిందితులకు సమన్లు జారీ చేయడంతో, కోర్టు లో ఆయన హాజరుకానున్నారు. 

Continues below advertisement

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తీరాన నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్ రెండో ఎడిషన్ ఏర్పాటు ప్రక్రియలో భారీ ఆర్థిక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ  కేసు నమోదు చేసింది.  మంత్రివర్గ ఆమోదం లేకుండా, కేబినెట్ రూల్స్ ఆఫ్ బిజినెస్, ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా లండన్‌కు చెందిన  ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకు హెచ్ఎమ్‌డీఏ  నిధుల నుంచి రూ. 55 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో అక్రమంగా మళ్లించారని ఏసీబీ మోపిన ప్రధాన ఆరోపణ.                

ఈ వ్యవహారంపై సుదీర్ఘ విచారణ జరిపిన ఏసీబీ, నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ప్రాథమిక ఛార్జ్‌షీట్‌లో కేటీఆర్‌ను ఏ-1  నిందితుడిగా చేర్చింది. ఆయనతో పాటు నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్  , హెచ్ఎమ్‌డీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్. రెడ్డి  , స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు ,  ఫెయో సంస్థ ప్రతినిధి ఆల్బర్టో లోంగో  లపై ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం ( కింద తీవ్ర అభియోగాలు మోపారు. కేటీఆర్ చట్టపరమైన అనుమతులు లేకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చి నిధులు మళ్లించేలా చేశారని ఏసీబీ పేర్కొంది.             

Continues below advertisement

విచారణ ప్రారంభ రోజు కావడంతో కోర్టు విధించే విచారణ నిబంధనలు, షూరిటీలు,  వ్యక్తిగత బాండ్ల సమర్పణ వంటి చట్టపరమైన ప్రక్రియల నిమిత్తం నిందితులందరూ విధిగా వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయకపోవడంతో, శుక్రవారం  విచారణ అనంతరం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కేటీఆర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారా? లేదా విచారణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది? అనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.                   

మరోవైపు ఈ కేసును కేవలం అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయ కక్షసాధింపు చర్యగా బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయిలో పెంచేందుకే ఫార్ములా ఈ-రేస్‌ను నిర్వహించామని, ఇందులో ఎలాంటి నిధుల దుర్వినియోగం లేదని కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరవుతున్నందున ఏసీబీ కోర్టు ప్రాంగణంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.