KTR Sensational Comments on Zaheerabad Meeting: రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం నెల రోజుల పాలనలో హామీల నుంచి తప్పించుకోవాలని చూసి అప్రతిష్ట మూటగట్టుకుందని బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ భవన్ లో జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనాచారి, ఎంపీ బీబీ పాటిల్, పార్టీ ప్రజా ప్రతినిధులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ లను మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందని.. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట ఓ వంతు సీట్లు గెలిచామని.. అప్పుడు కాంగ్రెస్ కు ఓటేసిన వారు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారని చెప్పారు. కాంగ్రెస్ హామీలను అమలు చేసేలా ఒత్తిడి తేవాలని.. ప్రజల్లోకి ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్లాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ సీటును బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా పలు సూచనలు చేశారు.


పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ


2014 ఎన్నికల్లో అనివార్యంగా పోటీ చేశామని.. అప్పుడు సంస్థాగతంగా పార్టీ గట్టిగా లేకపోయినా ప్రజలు దీవించారని కేటీఆర్ గుర్తు చేశారు. రెండుసార్లు మనల్ని ఆశీర్వదించారని చెప్పారు. ఈసారి 119 సీట్లలో 39 స్థానాలు గెలిచామని.. ఇది చిన్న సంఖ్య కాదని అన్నారు. ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరిగాయని.. ఊహించని ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోరు జరగనుందని.. ఈ బరిలో బీఆర్ఎస్ కే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని అన్నారు. కేసీఆర్ (KCR) పట్ల సానుభూతి, కాంగ్రెస్ కు దూరమైన వర్గాలు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి బాటలు వేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 'జుక్కల్ లో బీఆర్ఎస్ ఓటమి అస్సలు ఊహించలేదు. నారాయణ ఖేడ్ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేత అక్కడ గెలిచారు. దళిత బంధు నిజాంసాగర్ మండలం మొత్తం ఇచ్చినా.. మిగిలిన వర్గాలు బీఆర్ఎస్ కు ఓటు వేయలేదు. తెలంగాణ కోసం కడుపు చించుకొని కొట్లాడింది బీఆర్ఎస్ మాత్రమే. మనం బలంగా లేకపోతే తెలంగాణ పదాన్ని మాయం చేసేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల బూచీ చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు అప్పుడే నిరసన సెగలు మొదలయ్యాయి. కాంగ్రెస్ హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఒత్తిడి పెంచుదాం.' అని పేర్కొన్నారు.


'జిల్లాలు రద్దు చేస్తే ఊరుకుంటారా.?'


బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. జిల్లాల సంఖ్యను తగ్గించేందుకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కమిషన్ వేస్తామంటున్నారని తెలిపారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా.? అని ప్రశ్నించారు. రేవంత్ సర్కారు అనేక తిరోగమన చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రభుత్వం మీద విమర్శల విషయంలో బీఆర్ఎస్ తొందరపడడం లేదని.. తమ హయాంలో జరిగిన అభివృద్ధిని తక్కువ చేసి చూపించి, అప్పుల పాలు చేశామని కాంగ్రెస్ వాళ్లే మొదట దాడి మొదలు పెట్టారని అన్నారు. కాంగ్రెస్ నేతలు అనవసర విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.


Also Read: 100 రోజుల్లో కాంగ్రెస్ హామీలు నెరవేరాలి - ఆరు గ్యారెంటీలపై డీకే అరుణ వ్యాఖ్యలు