KTR Comments in Nagar Kurnool: కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపితే మన ప్రజలు మోసపోయారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చేతకాని ఎన్నో హామీలు ఇచ్చారని.. మహిళలకు రూ.2500, పెద్ద మనుషులకు రూ. 4 వేలు, తులం బంగారం, స్కూటీలు అంటే ప్రజలు నమ్మారని అన్నారు. కాంగ్రెస్ నేతలు సహా ఇక్కడి ఎమ్మెల్యే ఆరు గ్యారంటీల్లో తాము ఐదు గ్యారంటీలు అమలు చేశామని అంటున్నాడని.. రైతుభరోసా, రుణమాఫీ, రూ. 2500, స్కూటీలు, తులం బంగారం వచ్చినయా? అని కేటీఆర్ ప్రశ్నించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కల్వకుర్తి రోడ్ షో లో పాల్గొని కేటీఆర్  ప్రసంగించారు.


‘‘స్కూటీలు లేవు గాని...కాంగ్రెసోళ్ల లూటీ మాత్రం మొదలైంది. సిగ్గు లేకుండా ఐదు గ్యారంటీలు అమలు చేసిన అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. లంకెబిందెల ఉంటాయనుకొని వచ్చినా అని అంటున్నాడు. దొంగలు కదా లంకెబిందెల కోసం వెతికేది. రేవంత్ రెడ్డివి అన్ని రోత మాటలే. ఆయన మాటలు వింటుంటే ఈయన మన ముఖ్యమంత్రా అని బాధనిపిస్తోంది. మెడల పేగులు వేసుకుంటా, జేబుల కత్తెర పెట్టుకుంటా అని అంటాడు. సీఎం చేసే పనులా అవి? కాంగ్రెస్ కు ఓటు వేస్తే మేము ఏ హామీలు అమలు చేయకున్నా సరే ప్రజలు మాకే ఓటు వేశారని రేవంత్ రెడ్డి అంటాడు. హామీలు అమలు చేయకపోయినా ఓటు వేస్తే కచ్చితంగా ఇచ్చిన హామీలను ఎగ్గొడతాడు. చోటా భాయ్ కాంగ్రెస్, బడే భాయ్ బీజేపీతో మనకు పోటీ. 


కేసీఆర్ యాదాద్రి కట్టలేదా?
నమో అంటే నరేంద్రమోడీ కాదు...నమ్మించి మోసం చేసే వ్యక్తి. రైతుల ఆదాయం డబుల్, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, ఐదు ట్రిలియన్ డాలర్లు, బుల్లెట్ ట్రైన్ అన్నాడు. ఒక్కటైనా అయ్యిందా? పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇయ్యలే. కృష్ణా నీళ్ల వాటా తేల్చలేదు. ఒక్క పని చేయకుండానే ఓటు వేయమంటారు. ఎందుకంటే గుడి కట్టినం అంటారు. గుడి కట్టుడు ఒక్కటే ఓటు వేసేందుకు కారణమైతే కేసీఆర్ కట్టలేదా యాదాద్రి. దేవున్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నామా? కేసీఆర్ గారు కాళేశ్వరం లాంటి ఆధునిక దేవాలయం కట్టిండు. రిజర్వాయర్లు, చెరువులను పూర్తి చేసిండు. వాటికి కూడా దేవుళ్ల పేర్లు పెట్టిండు. 


బీజేపోళ్లు రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర కూడా చేస్తున్నారు. అబ్ కీ బార్ 400 అంటున్నారు బీజేపోళ్లు. మరి ఆయన మళ్లీ గెలిస్తే పెట్రోల్, డీజిల్ ను రూ.400 చేస్తడు. సిలిండర్ 1200 లు చేసిన సరే ప్రజలు నాకే ఓటు వేస్తరని ధరలు మరింత పెంచుతాడు. మోదీ ప్రధాని అయినప్పటికి ఇప్పటికీ క్రూడ్ ఆయిల్ ధర 16 డాలర్లు తగ్గింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గిన తర్వాత కూడా పెట్రోల్, డిజీల్ ధరలు ఎందుకు పెరిగినయ్? ప్రజల ముక్కు పిండి రాష్ట్రాలకు వాటా దక్కకుండా సెస్ వేసి రూ. 30 లక్షల కోట్లు వసూలు చేసిండు. 34 శాతం పన్ను అదనంగా వేసి మన దగ్గర నుంచి 30 లక్షల కోట్లు వసూలు చేసిండు. ఏం చేసినవయ్యా ఆ పైసలు అంటే జాతీయ రహదారులు కట్టినా అంటాడు. మరి టోల్ ఎందుకు వసూల్ చేసివంటే చెప్పడు. 


రూ. 30 లక్షల కోట్ల నుంచి అదానీ, అంబానీ లాంటి పారిశ్రామిక వేత్తలకు రూ.పద్నాలున్నర లక్షల కోట్లు రుణమాఫీ చేసిండు. పేదలను కొట్టిండు. పెద్దలకు పెట్టిండు. కాకులను కొట్టిండు...గద్దలకు పెట్టిండు. సరిగ్గా ఐదు నెలల కింద జైపాల్ యాదవ్ అన్నను గెలిపించాలని కోరాం. కానీ మీకు ఏం కోపం వచ్చిందో గెలిపియలే. మా ఎమ్మెల్యే ఓడిపోతాడు కానీ..కేసీఆరే సీఎం అవుతారని భావించారు కదా? కల్వకుర్తిలో గతంలో పార్టీ తరఫున ఏమైనా తప్పులు జరిగి ఉంటే మనసులో నుంచి వాటిని తీసేయండి. కరెంట్ కష్టాలు, మోటార్లు కాలే సమస్య మొదలైందా? మార్పు బాగుందా? 


ఉపాయం చెప్పిన కేటీఆర్
కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్లకు మంచి ఉపాయం చెబుతా. 10-12 సీట్లు ఇస్తే మళ్లీ కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు. గుంపు మేస్త్రి ఇంటికి పోతాడు. ప్రభుత్వాన్ని నడుపుడంటే పాన్ డబ్బా నడిపినట్లు కాదు రేవంత్ రెడ్డి. పరిపాలన అంటే మాటలు చెప్పినంత సులభం కాదు. ఒక్కసారి మనం మోసపోతే మన తప్పు. రెండోసారి కూడా మోసపోతే అది మన తప్పే అవుతుంది. అధికారిగా అద్భుతాలు సృష్టించిన మొనగాడు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఇలాంటి చదువుకున్న వ్యక్తి పార్లమెంట్ లో ఉంటే మన గౌరవం పెరుగుతుంది. ఎనిమిదేళ్లు సర్వీసు ఉన్నప్పటికీ ప్రజా సేవ కోసం బీఆర్ఎస్ ను ఎంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఎన్నో పదవుల ఇస్తామని ఆశ చూపిన సరే ఆయన బీఆర్ఎస్ లో చేరిండు. కనుక ఓటు వేసే ముందు తప్పకుండా ఆలోచించాలె ఓటు వేయాలె’’ అని కేటీఆఱ్ మాట్లాడారు.