KTR On Governer : ఈ దేశంలో గవర్నర్ పోస్టు అవసరమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని, ప్రజల చేతు ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను అప్రతిష్టపాలు చేయడం సరికాదన్నారు. కేబినెట్ సిఫారసు చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ రిజెక్ట్ చే్యడంపై కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీకి ఒక నీతి. పరస్పరం సహకరించుకుంటాయి. కర్ణాటకలో కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్సీలుగా చేయడంలో అక్కడి బీజేపీ గవర్నర్ సహకరిస్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అర్హత లేని వారిని నామినేట్ చేస్తారు. తెలంగాణ విషయానికి వచ్చే సరికి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న శ్రవణ్, సత్యనారాయణ అనర్హులు అయ్యారని.. ఈ విషయాన్ని ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రజా ఉద్యమాల్లో పని చేసిన వారిని మా కేబినెట్ నామినేట్ చేసిందని కేటీఆర్ తెలిపారు. దాసోజు శ్రవణ్ ప్రొఫెసర్. తెలంగాణ ఉద్యమంతో సహా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. నాకైతే గ్యారంటీ ఉండే. మేడమ్‌కు మా మీద ఉన్నంత కోపం.. ఆయన మీద ఉండదు ఎందుకంటే ఆయన మంచి ప్రొఫెసర్ అని. మంచివాడు ఆమోదిస్తారని అనుకున్నాం. ఇక సత్యనారాయణ అయితే ఒక ఎరుకల కమ్యూనిటీ నాయకుడు. ట్రేడ్ యూనియన్ నాయకుడిగా జాతీయ స్థాయిలో పని చేశారు. ట్రేడ్ యూనియన్‌లో చేసిన సేవలకు జనరల్ నియోజకవర్గంలో ఆయనను ప్రజలు గెలిపించారు. ఈ ఇద్దరి నేపథ్యాన్ని మనసుతో ఆలోచించి ఉంటే నిర్ణయం ఇలా రాకపోయేదన్నారు.
మోదీతో పాటు ఆయన ఏజెంట్లుగా గవర్నర్లు అప్రజాస్వామికంగా ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కేవిధంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నవారిని ఇలాంటి పదవుల్లోకి తీసుకురావొద్దని లేఖ రాశారు. అంతకంటే హాస్యాస్పదమైన మాట ఇంకోటి లేనేలేదు. ఆమె కూడా రాజకీయ నాయకురాలు. తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్‌గా పని చేశారు. గవర్నర్ అయ్యే ఒక రోజు ముందు వరకు కూడా ఆమె బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్. క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న వారు గవర్నర్లుగా రాకూడదని సర్కారియా కమిషన్ స్పష్టంగా చెప్పింది అని కేటీఆర్ గుర్తు చేశారు.
అన్‌ఫిట్ అనే పదం ఉత్తర్వుల్లో గవర్నర్ వాడారు.. ఎవరు అన్‌ఫిట్. మీరా. మోదీనా అని కేటీఆర్ ప్రశ్నించారు. సర్కారియా కమిషన్‌ను తుంగలో తొక్కిన మోదీనా..? తప్పకుండా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. బలహీన వర్గాలకు చెందిన బలమైన గొంతుకలను శాసనమండలికి తీసుకువస్తామంటే మీకేం బాధ..? మంచివారా కాదా విచారించండి. అవును రాజకీయ పార్టీతో సంబంధం ఉంది. గవర్నర్ బీజేపీ నాయకురాలిగా పని చేయడం లేదా..? ఇది తప్పా..? తీవ్రంగా ఖండిస్తున్నాం గవర్నర్ వైఖరిని. తమిళనాడు గవర్నర్ తమిళనాడు పేరును మార్చేస్తారు. ఇంకో గవర్నరేమో సీఎంకు సంబంధం లేకుండా నిర్ణయాలను తీసుకుంటారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలకు ప్రాధాన్యత లేకపోతే ఎలా..? మోదీ ఏజెంట్లది పెత్తనం అయితే ఇదెక్కడి వ్యవస్థ..? అని కేటీఆర్ ప్రశ్నించారు.