KTR News :  తెలంగాణలో  1.82 శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయామని, పార్టీ నిర్మాణంపై దృష్టి పెడితే బాగుండేదని అనే అభిప్రాయానికి వచ్చామని, చిన్న చిన్న లోపాలతోనే ఓడిపోయామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంపై సమీక్ష తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.  అభివృద్ధి విషయంలో ఎలాంటి ఫిర్యాదులు లేవని, బిఆర్‌ఎస్‌పై జరిగిన అసత్య ప్రచారాన్ని ఖండించలేకపోయామని వివరించారు. అమలు చేసిన పథకాలను సమర్థవంతంగా ప్రచారం చేసుకోలేకపోయామని కెటిఆర్ బాధను వ్యక్తం చేశారు. కెసిఆర్ సిఎంగా లేరు అన్న విషయాన్ని చాలా మంది వ్యవక్తపరుస్తున్నారని, అభ్యర్థుల మీద వ్యతిరేకతతో ఓటేశామని చాలా మంది అంటున్నారని కెటిఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి గెలిచిందని, కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. 


తెలంగాణ వాయిస్ బీఆర్ఎస్ 
  
బీఆర్‌ఎస్‌ నాయకులను పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు ఎందుకు గెలిపించాలి? ఏ కారణం చేత ఓటు వేయాలి ? అనే ప్రశ్న వస్తుందని..  బీఆర్‌ఎస్‌ ఎంపీలను ఎందుకు గెలిపించాలంటే.. తెలంగాణ బలం.. తెలంగాణ గళం.. తెలంగాణ దళం పార్లమెంట్‌లో ఉండాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలన్నారు.  తెలంగాణ అన్న మాట ధైర్యంగా  అనాలంటే..  తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు తెగేదాక అవసరమైతే నిలబడాలి.. కలబడాలంటే కేంద్ర ప్రభుత్వంతో అది సాధ్యమయ్యేది బీఆర్‌ఎస్‌కే మాత్రమేన్నారు.   


తెలంగాణ ప్రజలకు ఏకైక ప్రతినిధి బీఆర్ఎస్


‘తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి బీఆర్‌ఎస్‌. తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి బీఆర్‌ఎస్‌.. ఈ విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. గత పదేళ్ల కార్యాచరణ చూస్తే పార్లమెంట్‌ చూస్తే తెలంగాణ అనే మాట ప్రతి సమయంలో ప్రతిధ్వనించిందంటే.. దానికి బీఆర్‌ఎస్‌ ఎంపీలు. ఢిల్లీలో వాయిస్‌ అంటే బీఆర్‌ఎస్‌ అనే మాట అందరికీ తెలుసు. కాంగ్రెస్‌, బీజేపీ కానీ అన్ని రాష్ట్రాల్లో ఇదో రాష్ట్రంగా చూస్తాయి. కానీ, మాకు ఎపీ సెంటర్. మేం కూడా ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని ఆకాంక్ష ఉన్నప్పటికీ మాకు ప్రధాన కేంద్రం హైదరాబాద్‌, తెలంగాణ. మా ప్రధాన ఎజెండానే తెలంగాణ కాబట్టి.. తెలంగాణ కోసం.. సమస్యలు, హక్కులు, వాటాల కోసం ప్రత్యేకంగా పోరాడగలిగేది.. బలంగా కృషి చేయగలిగేది బీఆర్‌ఎస్‌ మాత్రమే. అందుకే అంటున్న తెలంగాణ బలం, గళం, దళం బీఆర్‌ఎస్‌. అందుకే పార్లమెంట్‌లో ప్రశ్నించాలన్నా.. ఏ అంశంపై లేవనెత్తాలన్నా కేవలం అది చేయగలిగేది.. పోరాడగలిగేది బీఆర్‌ఎస్‌ మాత్రమే అనే మాటను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా’నన్నారు.
 
తెలంగాణ అంటే కేసీఆర్ - కేసీఆర్ అంటే తెలంగాణ 


‘ఎవరు ఎన్ని చెప్పినా.. ఎన్ని మాట్లాడినా నిర్వివాదమైన అంశం.. ఇందులో రెండో ఆలోచనకు ఆస్కారం లేదు. పవర్‌ఫుల్‌ నేతలతో ఆయా రాష్ట్రాలకు ఒక గుర్తింపు, గౌరవం వచ్చింది. కేసీఆర్‌తో తెలంగాణ అనే రాష్ట్రం వచ్చింది.. ఆ రాష్ట్రానికి అస్థిత్వం వచ్చింది. తెలంగాణ అనే పదానికి పర్యాయపదంగా కేసీఆర్‌ మారారంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ కోసం 32 రాజకీయ పార్టీలను ఒప్పించినా.. పార్లమెంట్‌లో ఫోర్త్‌స్థాయి ఎంప్లాయ్‌ నుంచి ప్రధానిమంత్రి దాకా అందరినీ కలిశారు. ఆయనను చూడగానే తెలంగాణ గుర్తుకు వస్తుందనే విధంగా కేసీఆర్‌ ఎక్కని కడప లేదు.. మొక్కని బండ లేదు అన్నట్లు ఆ నాడు విస్తృతంగా ఢిల్లీలో ఆ రోజు చేసిన ప్రయత్నం వల్లే రాష్ట్రం సాకారమైన విషయాన్ని గుర్తు చేస్తున్నా’నన్నారు.