TSCAB Chairman Resigned: హైదరాబాద్: తెలంగాణలో మరో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. టెస్కాబ్ ఛైర్మన్ (TSCAB Chairman) పదవికి కొండూరి రవీందర్ రావు రాజీనామా చేశారు. వైస్ ఛైర్మన్ గోంగిడి మహేందర్ రెడ్డి సైతం తన పదవికి రాజీనామా చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. పదవులకు రాజీనామా చేసిన ఇద్దర్నీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమంటూ, పదవులను గడ్డిపరకల్లా వదులుకోవడం నేర్పిన కేసీఆర్ బాటలో ఈ ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేయడాన్ని మెచ్చుకున్నారు. 


కాంగ్రెస్‌లో చేరి పదవులు కాపాడుకోవాలని ప్రలోభపెట్టినా, ఒత్తిడికి గురిచేస్తున్నా లొంగకుండా, నమ్మి నడిచిన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ బాటకే జై కొట్టారని కేటీఆర్ పేర్కొన్నారు. కొండూరి రవీందర్ రావు, గోంగిడి మహేందర్ రెడ్డి తమ పదవీకాలంలో తెలంగాణలో సహకార బ్యాంకులను అద్భుతంగా నిర్వహించిన వీళ్ల పేరు రాష్ట్ర సహకార రంగ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. పదివేల కోట్ల రూపాయల రుణాలతో ఉన్న టెస్కాబ్ ను 42,000 కోట్ల సంస్థగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే వినియోగదారుల సంఖ్యతో పాటు, డిపాజిట్లను 3 రెట్లు పెంచి నమ్మకమైన సంస్థలుగా తయారు చేశారని తెలిపారు. 


టెస్కాబ్ (TSCAB) ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపడంతో పాటు పలు అవార్డులతో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్ గా నిలిచిందన్నారు కేటీఆర్. వీరి రాజీనామా రాష్ట్ర కోపరేటివ్ రంగానికి తీరని లోటు అవుతుందన్నారు. అత్యుత్తమంగా పనిచేస్తున్న వారిని కుట్రపూరితంగా పక్కకు తప్పించడం ద్వారా తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు.