KTR :  చేసింది  చెప్పుకోలేకపోవడం వల్లనే  పరాజయం  పాలయ్యామని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.  అధికారంలోకి వస్తాం అని కాంగ్రెస్ పార్టీ(Congress) వాళ్లు కూడా అనుకోలేదు. నోటికి ఏది వస్తే అది హామీలుగా ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) అన్నారు. గురువారం మహబూబాబాద్‌ లోక్‌సభ (Mahabubabad Lok Sabha) నియోజకవర్గంపై తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు అన్నారు. కానీ 420 హమీలిచ్చారు. కాంగ్రెస్ వాళ్ల తప్పుడు ప్రచారం నమ్మి ప్రజలు గొప్పగా పని చేసిన నాయకులను కూడా తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు ఇవ్వలేదు అని తప్పుడు ప్రచారం చేశారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఆరోపంచారు. తొమ్మిది న్నరేండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చిందని కేటీఆర్‌ తెలిపారు.   అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మేము ఏనాడు చెప్పుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం అత్యధిక వేతనాలు ఇచ్చింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కానీ మేము చెప్పుకోలేదు, ప్రచారం చేసుకోలేదన్నారు.


వందలాది సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వ హయాంలో అమలు చేసినా, ఏనాడు కూడా ప్రజలను లైన్‌లలో నిలబెట్టలేదు. ప్రజల సౌకర్యమే చూసాము కానీ రాజకీయ ప్రయోజనం, రాజకీయ ప్రచారం గురించి ఏనాడు ఆలోచించలేదన్నారు. ప్రజలు మనల్ని పూర్తిగా తిరస్కరించలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి మూడో వంతు సీట్లు 39 వచ్చాయి. 14 స్థానాల్లో ఓటమి కేవలం గరిష్ఠంగా 6 వేల ఓట్ల తోనే జరిగింది. మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీకి మనకు తేడా కేవలం 1.85 శాతమేనని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తామంటూ రేవంత్ రెడ్డి అనేక మాటలు మాట్లాడారు. రుణం ఉన్నవాళ్లే కాదు, వ్యవసాయ రుణం లేనివాళ్లు కూడా తీసుకోండని సూచించారు. అధికారంలోకి రాగానే వెంటనే రుణమాఫీ చేస్తామన్నారు. ఇచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దారిలేకనే అప్పులంటూ, శ్వేతపత్రాలంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.


దేశంలో అందరికన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులకు 73% జీతాలు పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్. 29 లక్షల ఫించన్లను 46 లక్షలకు పెంచినా ఏనాడు చెప్పుకోలేదని గుర్తు చేశారు. దేశంలో అందరికన్నా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది తెలంగాణ ప్రభుత్వమే కానీ ఇలాంటి అనేక అంశాలను చెప్పుకోవడంలో విఫలమయ్యాం. అందుకే కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే మేమే గెలిచే వాళ్లం అన్నారు.
 
ఎవరు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి పార్టీ సమావేశాలను వరుసగా పెట్టుకుందాం. అనుబంధ సంఘాలను బలోపేతం చేసుకుందామన్నారు. పార్టీకి అన్ని వర్గాలను దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. గిరి జనులకు స్థానిక సంస్థల రిజర్వేషన్ తో పాటు.. పోడు భూముల పట్టాల పంపిణీ, అనేక ఇతర సంక్షేమ పథకాలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గతంలో కొనసాగించింది. అయినా గిరిజనులు ఎక్కువ ఉన్న చోట్లకూడా ప్రజలు పూర్తి మద్దతు మనకివ్వలేదన్నారు. ఇలాంటి వాటన్నింటిపై ఆత్మవిమర్శ చేసుకుని ముందుకుపోదామని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు.