KTR Letter To CM Revanth Reddy over Auto Drivers issue: హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ బహిరంగ లేఖ రాశారు. ప్రజాపాలన తెస్తామని అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన మీ ప్రభుత్వం ప్రజావ్యతిరేకిగా మారిపోయిందన్నారు. ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాలని, ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయిన ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి  నెలకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించాలని లేఖలో ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత విధానాలతో, ఒక హామీ అమలుచేసే హడావుడిలో మరో వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న తీరు మీ పాలనా వైఫల్యాన్ని కళ్లకు కడుతోందన్నారు.
కేటీఆర్ రాసిన లేఖలో ఏముందంటే..
‘గత పదేళ్లు తెలంగాణలో అన్నివర్గాలు సంతోషంగా ఉంటే.. కేవలం మీ 55 రోజుల పరిపాలనలో ఎన్నో వర్గాలు ఆగమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆటో డ్రైవర్లు మీ వల్ల ఇవాళ రోడ్డున పడ్డారు. ఇంతకాలం చెమటోడ్చి తమ కుటుంబాలను పోషించుకుంటున్న ఆటోడ్రైవర్ల పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో అగమ్యగోచరంగా మారింది. ఆటో డ్రైవర్లు అన్నమో రామచంద్ర అంటూ ఆవేదన చెందుతున్నారు. 


ఆటోలకు గిరాకీ లేకపోవడంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థంకాక.. ఇటీవల ఏకంగా 15 మంది ఆటోడ్రైవర్లు రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారంటే.. పరిస్థితి ఎంత చేజారిపోయిందో అర్థమైపోతోంది. ఆటోలు ఎక్కే వాళ్లు లేకపోవడంతో తమ కుటుంబం గడవని పరిస్థితిని వారు ఎదుర్కొంటున్నారు. పిల్లల ఫీజులు ఎలా చెల్లించాలో అర్థంకాక మానసిక వేదన అనుభవిస్తున్నారు. వీటికి తోడు కిరాయి ఆటోలు నడుపుకునే డ్రైవర్ల పరిస్థితి మరింత దుర్భరం. అద్దెకు తెచ్చిన ఆటో కిరాయి పైసలు కూడా రాకపోవడంతో.. ఇక బతుకు బండిని లాగేదెలా అని లక్షలాది మంది ఆటో డ్రైవర్లు ఆందోళనలో ఉన్నారు. ఇక అప్పు తెచ్చి ఆటోలు కొని నడుపుతున్న డ్రైవర్ల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. గురువారం ఒక గిరిజన ఆటోడ్రైవర్ సోదరుడు ఏకంగా బేగంపేటలోని ప్రజాభవన్ ముందు తనకు ఇంతకాలం బువ్వపెట్టిన ఆటోను చేతులారా తగలబెట్టుకున్నాడు. 


రెండు నెలలు నిండని కాంగ్రెస్ పాలనలో ఇప్పటివరకు దాదాపు 15 మంది డ్రైవర్లు ఆత్మహత్యల చేసుకోవడం అత్యంత బాధాకరం. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆయా ఆటోడ్రైవర్ల కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్య తీవ్రరూపం దాలుస్తున్న తరుణంలోనే  మా పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీని వేశాం. ఆటో సంఘాలు, డ్రైవర్లతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాం. వాటన్నంటినీ ఒక నివేదిక రూపంలో తయారుచేసి మా పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి పంపించాం. కానీ ఇప్పటివరకు మీ ప్రభుత్వం వైపు నుంచి దానిపై స్పందించిన పాపాన పోలేదు’ అని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో కేటీఆర్ పలు విషయాలు ప్రస్తావించారు. 


అన్నం పెట్టిన ఆటో మంటల్లో కాలిపోయినా, పరిస్థితి తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలోని 6.50 లక్షలాది మంది ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. గత రెండు నెలలుగా ఉపాధి లేక రోడ్డున పడ్డ ఆటోడ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రతినెలా 10 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న 15 మంది ఆటోడ్రైవర్ల ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.