ట్విట్టర్‌లో కేటీఆర్ ఎంత యాక్టవ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన యాక్టివ్‌నెస్‌కు తగ్గట్లే సందర్భం వచ్చినప్పుడల్లా నెటిజన్లు కూడా రియాక్టవుతున్నారు. చాలా సార్లు ఈ స్పందనలు పాజిటివ్‌గా ఉన్నా ఒక్కో సారి వైల్డ్‌గా ట్వీట్లతో ఎటాక్ చేసేస్తున్నారు. అలాంటి సందర్భం మంగళవారం రాత్రి హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షం నెటిజన్లకు కల్పించింది. హైదరాబాద్‌లో బుధవారం తెల్లవారు జామున ఒక్క సారిగా జడివాన కురిసింది.
వర్షాకాలం కోసం ఇంకా జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి సన్నాహాలు ప్రారంభించకపోవడం.. నాలాలను కూడా బాగు చేయకపోవడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పాతబస్తీ, కుత్‌బుల్లాపూర్, వనస్దలిపురం, ముసారాంబాగ్ వంటి ప్రాంతాల్లో రోడ్లు చెరువులయ్యాయి. దీంతో కొంత మంది బోట్లతో కాసేపు ఆటలాడారు. ఈ వీడియోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన నెటిజన్లు హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల పరిస్థితిపై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో భారీ వర్షాల కారణంగా కరెంట్ సరఫరా కూడా ఆగిపోయింది.దీనిపైనా కేటీఆర్‌ను ప్రశ్నిస్తూ ట్వీట్లు చేశారు.
మామూలుగా అయితే కేటీఆర్‌కు వ్యతిరేక ట్వీట్లు పెట్టినా ఇంత ఎక్కువగా స్పందన రాదు. కానీ ఇటీవల కేటీఆర్ అటు బెంగళూరు, ఇటు ఏపీలోని పరిస్థితులపై విమర్శలు గుప్పించారు. అక్కడి కన్నా హైదరాబాద్ ఎంతో మెరుగైనదని వాదించారు. ఈ క్రమంలో కర్ణాటక అధికార పార్టీ బీజేపీ... ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా తమ శక్తి మేర కేటీఆర్‌ను టార్గెట్ చేశారు.