సాయం చేసే చేతులు మిన్న అని గట్టిగా నమ్మే మంత్రి కేటీఆర్. ప్రత్యేకంగా ఓ టీమ్‌ను పెట్టి మరీ తన వైపు నుంచి సాయం చేస్తూ ఉంటారు. అది వైద్యపరమైన సాయమే కాదు విధికి ఎదురు వెళ్లే వారికీ తన వంతు సాయంతో భరోసా ఇస్తూ ఉంటారు. కుటుంబ పోషణ కోసం ధైర్యంగా ఆటో నడుపుతున్న ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థిని నల్లగొండకు చెందిన ఆటో గర్ల్ సబితకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా సబిత పని చేయాల్సి వచ్చింది. కానీ ఆమెకు చదువంటే ఇష్టం. అందుకే చదువు కొనసాగిస్తూనే కుటుంబానికి అండగా ఉండాలని ఆటో నేర్చుకున్నారు. చదువుకుంటూనే ఆటో తోలుతూ కుటుంబానికి అండగా ఉంటుంది.  


సబిత విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది.  వెంటనే ఆయన ఆమెకు అండగా ఉండేందుకు నిర్ణయం తీసుకొన్నారు. సాధారణంగా ఆటో నడిపి డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఆడవాళ్లు చేయరు. కానీ సబిత భిన్నంగా ఆలోచించారు. ధైర్యంగా దాంతో కుటుంబాన్ని నిలబెట్టిన తీరు మంత్రి కేటీఆర్‌ను ఆశ్చర్యపరిచింది. ఆమెను స్వయంగా కలిచి సహాయం అందిస్తానని గతంలో హామీ ఇచ్చారు.   సబితను ఈరోజు ప్రగతి భవన్ కి పిలిపించుకొని ఆమెతో  మాట్లాడారు కేటీఆర్.  సబిత కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెకి ఏం కావాలో తెలుసుకున్నారు. 


సబిత తండ్రి కొన్నాళ్ల క్రితం చనిపోయారు. ఆమె తల్లి తల్లి కొందరి ఇళ్ళల్లో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకు వస్తోంది. సబిత పేదరికం దృష్టిలో ఉంచుకొని డబుల్ బెడ్ రూం ఇంటితో పాటు నూతన ఆటో రిక్షా కూడా అందించాలని కేటీఆర్ నిర్ణయించారు.  భవిష్యత్తులోనూ ఆమెకు అండగా ఉంటామని తెలిపారు. మహిళలు తలచుకుంటే ఏదైనా చేయగలుగుతారని సబిత నిరూపించిందని కేటీఆర్ అభినందించారు. పట్టుదల ఉంటే కష్టాలను ఎదుర్కోవడం అసాధ్యం కాదని నిరూపించిన గొప్ప ధైర్య సాహసి అని అభినందించారు.  


సబితా తన కుటుంబానికి అండగా నిలిచిన తీరు  యువతులకు ఖచ్చితంగా స్ఫూర్తిని ఇస్తుందన్నారు. మంత్రి కేటీఆర్ తన ప్రయత్నాలకు అండగా నిలవడం పట్ల సబిత సంతోషం వ్యక్తం చేశారు. తనను పిలిపించుకొని తన గురించి వివరాలు అడిగి తెలుసుకొని అతను అడిగిన మేరకు కుటుంబానికి సహాయం అందించడం ఎన్నటికీ మరచిపోలేని ఆమె తెలిపింది. కేటీఆర్ అందించిన సహాయం, స్ఫూర్తితో భవిష్యత్తు లో మరిన్ని మంచి లక్ష్యాలను చేరుకుంటానన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేసింది.