ప్రపంచ ఆర్థిక సదస్సులో మంత్రి కేటీఆర్‌పై పలువురి నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన డైనమిక్ లీడర్ అని, కేటీఆర్ వాగ్ధాటిని గతంలోనూ ఎంతో మంది మెచ్చుకున్నారు. తాజాగా దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఓ మహిళా వ్యాపార వేత్త కేటీఆర్‌ను ఆకాశానికెత్తేశారు. భారతీయ అమెరికన్ అయిన ఆ మ‌హిళా వ్యాపార‌వేత్త పేరు ఆశా జ‌డేజా మోత్వాని. ఈ మేరకు కేటీఆర్‌ను కీర్తిస్తూ ఆమె ట్వీట్ కూడా చేశారు. 


‘‘20 ఏళ్ల త‌ర్వాత కేటీఆర్ భార‌త‌దేశానికి ప్రధాని అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అన్ని అంశాల‌పై స్పష్టమైన అవ‌గాహ‌న‌, భావ వ్యక్తీక‌ర‌ణ ఉన్న ఇలాంటి యువ రాజ‌కీయ నాయ‌కుడిని నా జీవితంలో నేను ఇంత వరకూ చూడలేదు. తెలంగాణ టీం దావోస్‌లో ఫైర్ మీద ఉంది. కేటీఆర్ తెలంగాణ‌కు బిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులు తీసుకెళ్లే విధంగా ఉన్నార‌ు. నాకు సిలికాన్ వ్యాలీ స్టార్టప్ రోజులు గుర్తుకు వ‌స్తున్నాయి’’ అంటూ ఆశా జడేజా మోత్వానీ ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్‌తో దిగిన ఫోటోలను కూడా జత చేశారు.






తెలంగాణ‌లో పెట్టుబ‌డుల‌కు ఉన్న అవకాశాలను దావోస్ వేదిక‌గా మంత్రి కేటీఆర్ నాయకత్వంలోని టీమ్ వివ‌రిస్తూ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వేగంగా వృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ సంస్థ మీషో తెలంగాణలో ఫెసిలిటీ సెంటర్ పెట్టేందుకు అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సంస్థ అంగీకరించినట్లుగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.


UAE కి చెందిన లూలూ గ్రూప్ తెలంగాణలో 500 కోట్ల పెట్టేందుకు ముందుకు వచ్చినట్లుగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ఛైర్మన్‌తో భేటీ అయిన ఫోటోలను ట్వీట్ చేశారు. మహారాష్ట్ర ఐటీ మంత్రి ఆదిత్య ఠాకరేను మంత్రి కేటీఆర్ కలిశారు. తెలంగాణ, మహారాష్ట్ర కలిసి పరస్పర సహకారంతో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించినట్లుగా కేటీఆర్ ట్వీట్ చేశారు.






పెట్టుబడులకు ఆశీర్వాద్ పైప్స్ ఆసక్తి
రెండో రోజు దావోస్‌లో తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి దక్కింది. తాజాగా ఆశీర్వాద్ పైప్స్ (Aliaxis) గ్రూప్ తెలంగాణలో రూ.500 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు గారి సమక్షంలో దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో ఒక అవగాహన ఒప్పందం జరిగింది.  అలియాక్సిస్ కంపెనీ సీఈఓ కోయిన్ స్టికర్ మంత్రి కే. తారకరామారావు తో సమావేశం అయ్యారు. తాము పెట్టనున్న పెట్టుబడితో తెలంగాణలో ఏర్పాటు చేయనున్న తయారీ ప్లాంట్ ద్వారా స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్ పైల్స్, ఫిట్టింగ్స్ వంటి ప్లాస్టిక్ ఉత్పత్తులను ఉత్పత్తి చేయనున్నట్లు  కంపెనీ సీఈవో తెలిపారు. కేవలం దేశీయ మార్కెట్ల కోసం మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయి ప్లాస్టిక్ ఉత్పత్తులను ఇతర దేశాల కోసం సైతం తెలంగాణ నుంచి తయారుచేయడమే లక్ష్యంగా తమ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు 


తెలంగాణలో తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ఆశీర్వాద్ పైప్స్ కు మంత్రి కే తారకరామారావు ఆహ్వానం పలికారు. కంపెనీ ఏర్పాటు చేయనున్న తయారీ ప్లాంట్ ద్వారా 500 మందికి ప్రత్యక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ఈ రోజు ఆశీర్వాద్ పైప్స్ పెట్టుబడి ద్వారా ఈ రంగంలో మరిన్ని ఉత్పత్తులు పెట్టుబడులు తెలంగాణకు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కంపెనీ ఏర్పాటు చేస్తున్న తయారీ ప్లాంట్ కోసం అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.