KTR Criticized CM Revanth Reddy: మూసీ సుందరీకరణ వ్యయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ట్విట్టర్(X) వేదికగా స్పందించారు. మూసీ సుందరీకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఘరానా మోసానికి దిగారని ఆయన ఆరోపించారు. మూసీ సుందరీకరణకు అంచనాలను అమాంతంగా ఎందుకు పెంచారని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్‌లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. రూ.50 వేల కోట్ల అంచనాలను రూ.1.50 లక్షల కోట్లకు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. మూసీ ద్వారా ఎంత మందికి తాగునీరు, సాగునీరు ఇస్తారని సూటిగా అడిగారు.
అప్పుడు గగ్గోలు పెట్టింది మీరు కాదా
ఈ సందర్బంగా కేటీఆర్.. ‘‘మూసీ సుందరీకరణ కోసం మొన్న రూ.50వేల కోట్లు అన్నారు. నేడు రూ.1.50లక్షల కోట్లు అంటున్నారు. మూసీ సుందరీకరణకే రూ.1.50లక్షల కోట్లా? కాళేశ్వరానికి రూ.80వేల కోట్లు ఖర్చు చేస్తేనే గల్లి నుంచి ఢిల్లీ(Delhi) దాకా కాంగ్రెస్ గగ్గోలు పెట్టింది. మరి.. సుందరీకరణకే.. రూ.లక్షా యాభై వేల కోట్లా..! పదిహేను పక్కన ఇన్ని సున్నాలా..!! 15,000,000,000,000. మూసీ ప్రాజెక్టుతో మురిసిపోయే రైతులెందరు.. నిల్వ చేసే టీఎంసీలు ఎన్ని? సాగులోకి వచ్చే ఎకరాలు ఎన్ని .. పెరిగే పంటల దిగుబడి ఎంత.. తీర్చే పారిశ్రామిక అవసరాలెంత.
కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లెన్ని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కన్నా మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మక్కువ ? లండన్(London)లో థేమ్స్ లాగా మారుస్తామనే వ్యూహం వెనుక థీమ్ ఏంటి? గేమ్ ప్లాన్ ఏంటి? మూడింతలు పెంచిన అంచనా వ్యయం కాంగ్రెస్ ధన దాహానికి సజీవసాక్ష్యం.తట్టెడు మన్ను తీయకముందే.. కోట్లు తన్నుకుపోయే కుట్రకు తెరతీస్తే భరించం.. "మూసీ రివర్ ఫ్రంట్" పేరిట.. బ్యాక్ డోర్ లో జరుగుతున్న బాగోతాన్ని తెలంగాణ సమాజం అనుక్షణం గమనిస్తోంది. కుంభకోణాల కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాతపెడుతుంది’’ అంటూ రాసుకొచ్చారు.
కేటీఆర్‌కు 36 గంటలుగా జ్వరం
గత 36 గంటలుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. జ్వరం(Fever)తో పాటు దగ్గు, జలుబు కూడా ఉన్నాయి. వైద్యుల సూచనల మేరకు యాంటీవైరల్, యాంటీబయాటిక్ మందులు వాడుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. త్వరలోనే కోలుకుంటానని వెల్లడించారు. కాగా, హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో తెలంగాణ భవన్‌కు పెద్ద ఎత్తున బాధితులు తరలివచ్చారు. కేటీఆర్ తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయితే జ్వరం కారణంగా హైడ్రా(Hydra) బాధితుల వద్దకు కేటీఆర్ రాలేకపోయారు. తెలంగాణ భవన్‌కు వచ్చే బాధితులకు పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, న్యాయ విభాగం అండగా ఉంటుందని తెలిపారు.
150కోట్ల కుంభకోణం
కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు, ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని గనుల శాఖలో నకిలీ పత్రాలు, రశీదులు సృష్టించి రూ. 150 కోట్ల విలువైన 1.5 లక్షల టన్నుల ఇసుకను దోచుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కోసం ఇంటి దొంగలు ఇంత దోపిడీ చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండా ఈ దోపిడీ జరుగుతుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మైనింగ్ శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Also Read: Hydra Ranganath: హైడ్రా సైలెంట్‌గా లేదు- మల్లారెడ్డి, ఒవైసీల కాలేజీలు కూల్చివేతపై రంగనాథ్ క్లారిటీ