KTR on Bandi Sanjay: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడంపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. కవితకు బెయిల్ రావడం అనేది కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీలు సాధించిన విజయం అని సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. బెయిల్ విషయంలో ఆ రెండు పార్టీల వారి కృషి ఆఖరికి ఫలించిందని వ్యాఖ్యానించారు. కవిత బెయిల్ ద్వారా బయటకు వస్తే.. కాంగ్రెస్ లీడర్ తెలంగాణ నుంచి రాజ్యసభలోకి వెళ్తున్నారని విమర్శించారు.


దీనిపై కేటీఆర్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ‘‘మీరు కేంద్ర మంత్రి. కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రిగా ఉన్నారు. అలాంటి స్థానంలో ఉండి సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది మీ స్థానానికి తగినదేనా? గౌరవనీయులైన భారత ప్రధాన న్యాయమూర్తి, గౌరవనీయమైన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను గుర్తించి ధిక్కార చర్యలను తీసుకోవాల్సిందిగా నేను గౌరవపూర్వకంగా కోరుతున్నాను’’ అని కేటీఆర్ అన్నారు.



సాయంత్రం 7 గంటలకు కవిత విడుదల
కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు మంగళవారం ఉదయం బెయిల్ మంజూరు చేయడంతో.. ఆమె విడుదల ఈరోజు రాత్రి 7 గంటలకు ఉంటుందని అంటున్నారు. ఈ రాత్రికి ఢిల్లీలోనే కవిత ఉండనున్నారు. ఆమెతో పాటుగా కేటీఆర్, హారీష్ రావు కూడా ఉంటారు. రేపు మధ్యాహ్నాం 2.00 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు కవిత రానున్నారు.


కేసీఆర్ కాంప్రమైజ్ అయ్యే రకం కాదు
‘‘ఆయన కాంప్రమైజ్ అయ్యే రకం అయితే ఉన్న పదవిని వదిలేసి తెలంగాణ ఉద్యమం అంటూ నడుంకట్టేవాడే కాదు. ఆయన కాంప్రమైజ్ అయ్యే రకం అయితే 2006లోనే కేంద్ర మంత్రి పదవిని పూచికపుల్లలాగా వదిలేసేవాడే కాదు. ఆయన కాంప్రమైజ్ అయ్యే రకం అయితే  పార్టీ గెలుచుకున్న ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలన్నిటికీ తెలంగాణ కోసం రాజీనామాలు చేయించేవాడే కాదు. ఆయన కాంప్రమైజ్ అయ్యే రకం అయితే 2009 ఎన్నికల్లో డీలా పడినా లేచి నిలబడి ఆమరణ నిరాహార దీక్ష చేసేవాడే కాదు. ఆయన కాంప్రమైజ్ అయ్యే రకం అయితే నిర్బంధాలూ, ఆంక్షలూ, అణచివేతలు తట్టుకుని 14 యేళ్లు ఉద్యమాన్ని నడపగలిగేవాడే కాదు. ఆయన కాంప్రమైజ్ అయ్యే రకం అయితే అన్ని కుట్రలు, కుతంత్రాలు, డబ్బు సంచులు, లాబీయింగ్, ఉన్నప్పటికీ తెలంగాణ స్వరాష్ట్రమై విలసిల్లేదే కాదు. 



ఆయన కాంప్రమైజ్ అయ్యే రకం అయితే రాజకీయ కక్ష సాధింపులో కన్నబిడ్డ ఆరు నెలలు జైల్లో మగ్గే పరిస్థితి తెచ్చుకునేవాడు కాదు. ఆయన కాంప్రమైజ్ అయ్యేరకం అయితే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఆయన మీద ముప్పేట దాడి చేసేవే కాదు. ఆయన శూన్యం నుంచి సునామీ సృష్టించిన ఫైటర్! హిస్టరీతో పాటు, జాగ్రఫీని సృష్టించిన రేర్ లీడర్! నిలబడి కలబడటమే ఆయనకు తెలుసు. చీకట్లో చేతులు కలపడం ఆయన నైజం కానే కాదు. ఆయన కాంప్రమైజ్ అయినా, కలసిపోయినా అది కేవలం తెలంగాణ ప్రజలతోనే!’’ అని బీఆర్ఎస్ నేత కొణతం దిలీప్ చేసిన పోస్టును కేటీఆర్ షేర్ చేశారు.