KTR Responce On Merger of BRS party with BJP :  భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. అంతర్గత అజెండాతో కావాలనే నిరాధార ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన వైపు నుంచి ఇదే చివరి హెచ్చరిక అని బీఆర్ఎస్ పై చేస్తున్న తప్పుడు ప్రచారాలకు వివరణ ఇవ్వాలన్నారు. లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారత రాష్ట్ర సమితి ఇక ముందు కూడా తెలంగాణ ప్రజల కోసం పని చేస్తుందని స్పష్టం చేశారు. పడతాం.. లేస్తాం.. తెలంగాణ కోసం ఒంటరిగా పోరాడతామని తలవంచేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. 






కేటీఆర్, హరీష్ రావు గత ఐదు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. గత నెలలోనూ వారిద్దరూ వారానికిపైగా ఢిల్లీలో గడిపరు. ఒక్క రోజు మాత్రమే తీహార్ జైల్లో కవితతో భేటీ అయ్యారు. వీరు ఢిల్లీకి వెళ్లింది బీజేపీతో పొత్తు లేదా విలీన చర్చల కోసమేనని ఢిల్లీ రాజకీయవర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో జరిగిన చర్చల్లో విలీన ఫార్ములా, గడువు ఖరారయిందని ఓ తెలుగు మీడియా సంస్థ తాజాగా ప్రకటించింది. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో.. కేటీఆర్ స్పందించారు. 


నిజానికి ఇప్పటి వరకూ ఎవరు బీజేపీలో విలీనం లేదా పొత్తుల అంశంపై స్పందించలేదు. గతంలో  బీఆర్ఎస్ కు చెంది నలుగురు రాజ్యసభ సభ్యులు .. బీజేపీలో విలీనం అవుతారన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకూ అలాంటిదేమీ జరగలేదు. ఇప్పుడు నేరుగా పార్టీనే విలీనం అవుతుందన్న  ప్రచారం జరుగుతూండటంతో .. చెక్ పెట్టాలని కేటీఆర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే గట్టిగా హెచ్చరికలు జారీ చేశారని భావిస్తున్నారు.                                                             


ఈ విలీన రాజకీయంపై బీజేపీ నేతలు కూడా ఏమీ మాట్లాడటం లేదు. గతంలో మజ్లిస్ చీఫ్ ఓవైసీ కూడా ..విలీన  వార్తలపై స్పందించాలని కేసీఆర్, కేటీఆర్‌లను డిమాండ్ చేశారు. అయితే.. మజ్లిస్ చీఫ్ పర్సనల్‌గా ఏమైనా సందేశం పంపారేమో కానీ.. బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. తర్వాత ఓవైసీ కూడా మరోసారి అలాంటి ప్రస్తావన తీసుకు రాలేదు.