KTR Davos :    తెలంగాణ అభివృద్దికి ఎన్నారైలు క‌లిసి రావాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు కేసీఆర్ స్విట్జర్లాండ్ వెళ్లారు, అక్కడ ప్రవాస భారతీయులతో ఆయన సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. తర్వాత  స్విట్జ‌ర్‌లాండ్‌లోని జ్యూరిక్‌ న‌గ‌రంలో ప్ర‌వాస భార‌తీయులు నిర్వ‌హించిన‌ మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న‌ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ప్ర‌వాస భార‌తీయులు ఇచ్చే మ‌ద్ద‌తు గొప్ప‌గా ఉంటుందని అన్నారు. అంతేకాదు తెలంగాణ ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌చారం చేసి, రాష్ట్రానికి పెట్టుబడులు వ‌చ్చేందుకు కృషి చేయాలి అని ఆయ‌న కోరారు. 


దావోస్ వచ్చిన ప్రతీసారి భారతీయులు ఇచ్చే మద్దతు గొప్పగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని శాఖలు అధ్భుతమైన పని తీరుతో గొప్ప ప్రగతిని సాధిస్తున్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. స్వ‌ప‌రిపాల‌న కావాల‌ని ఉద్య‌మం చేశామ‌ని, రాష్ట్రం సాధించుకున్నాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయక‌త్వంలో ప‌లు అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్రమాలు చేప‌ట్టామ‌ని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చి యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తున్నామ‌ని, తెలంగాణ స‌మ‌గ్ర‌, స‌మీకృత‌, స‌మ్మిళిత అభివృద్ధి సాధిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. 


కాళేశ్వ‌రం ప్రాజెక్టును మూడేళ్లలోనే పూర్తి చేశామ‌ని, రైతులకు 24 గంట‌ల ఉచిత క‌రెంటు ఇస్తున్నామ‌ని, హ‌రిత హారంతో రాష్ట్రంలో ప‌చ్చ‌ద‌నం 7.7 శాతం పెరిగింద‌ని మంత్రి వెల్ల‌డించారు. అంతేకాదు ప్ర‌త్యేకంగా గ్రీన్ బడ్జెట్ ఏర్పాటు చేశామ‌ని చెప్పారు.ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తుంటే కొంద‌రు అప్పు, త‌ప్పు అంటున్నార‌ని, భార‌త దేశ సామాజిక ఆర్థిక‌ వ్య‌వ‌స్థ‌పై అవ‌గాహ‌న లేనివాళ్లు పేద‌ల‌కు ఇచ్చే ప‌థ‌కాల‌ను ఉచిత తాయిలాలు అంటూ హేళ‌న చేస్తున్నారని మంత్రి దుయ్య‌బ‌ట్టారు. 8 ఏళ్ల పాల‌న‌లో మోదీ ప్ర‌భుత్వం చేసింది ఏంట‌ని మంత్రి ప్ర‌శ్నించారు.  


వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) 2023 వార్షిక సదస్సుకు కేటీఆర్‌ నాయకత్వంలోని బృందం వెళ్లింది. కేటీఆర్  వెంట ఐటీ, పరిశ్రమలు ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, డిజిటల్‌ మీడియా, జీవశాస్త్రాల విభాగాల సంచాలకులు కొణతం దిలీప్‌, శక్తినాగప్పన్‌లు ఉన్నారు. ఈసారి సదస్సులో తెలంగాణ ప్రగతిపై కీలకోపన్యాసం ఇవ్వడంతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, కంపెనీల అధిపతులతో ఆయన భేటీ కానున్నారు. వివిధ ప్యానెళ్ల చర్చాగోష్టుల్లో పాల్గొననున్నారు. భారత్‌లో అత్యంత వేగవంతంగా పురోగమిస్తున్న అంకుర రాష్ట్రంగా తెలంగాణను ప్రపంచ ఆర్థిక వేదిక సద్సులో పరిచయం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.  


 వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) 2023 దావోస్‌లో నిర్వహించే వార్షిక సదస్సుకు కేటీఆర్‌కు  ప్రత్యేక ఆహ్వానం పంపించారు నిర్వాహకులు.  సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి పలు కంపెనీల సీఈవోలు, చైర్మన్లు, దేశంలోని వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరు కానున్నారు.  కేటీఆర్ వరుసగా ఎనిమిదో సారి ఈ ప్రపంచ వేదిక ఆర్థిక సదస్సుకు హాజరవుతున్నారు. 


వివేకా హత్య కేసులో కీలక మలుపు - గంగిరెడ్డి బెయిల్ రద్దు తేలేది హైదరాబాద్‌లోనే !