KTR : లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలో కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతాల్లో మరోసారి ప్రకటించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ( Loksabha Elections )  తెలంగాణ టీమ్ కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయాలి? అంటూ వినూత్న క్యాంపెయినింగ్‌కు తెర లేపారు. 16, 17వ లోక్‌సభ గణాంకాలను ఓ సారి పరిశీలిస్తే.. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు తెలంగాణ ( Telanagana )  హక్కులు, ప్రయోజనాల కోసం అవిశ్రాతంగా పని చేశాని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విధాలను ప్రశ్నించడం, డిమాండ్ చేయడంలో ఎంత బాగా పని చేశారో తెలుస్తుంది. 2014లో ప్రత్యేక రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక టీఆర్ఎస్ ( TRS ) మాత్రమేనని గుర్తు చేశారు. 2024లో కూడా లోక్‌సభకు తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్ నుంచే ప్రాతినిధ్యం ఉందన్నారు. నాడు.. నేడు.. ఏనాడైనా.. తెలంగాణ గళం.. తెలంగాణ బలం.. తెలంగాణ దళం.. మనమే..అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.


 





 


తెలంగాణ వాయిస్ బీఆర్ఎస్ అని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ వ్యూహం


‘మనమే తెలంగాణ గళం.. మనమే తెలంగాణ దళం.. మనమే తెలంగాణ బలం’ అని బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల్లోకి బలంగా తీసుకెళ్తున్నది. బీఆర్‌ఎస్సే ఎప్పటికైనా తెలంగాణ కు టార్చ్‌బేరర్‌ అని స్పష్టం చేస్తున్నది. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఎప్పటికైనా పరిరక్షించేది బీఆర్‌ఎస్సేనని ఆధారాలతో సహా పార్టీ శ్రేణులకు వివరిస్తున్నది. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఎందుకు గెలిపించాలో అన్ని స్థాయిల పార్టీ శ్రేణుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేస్తున్నది.


జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజల పట్ల పట్టింపు లేదని బీఆర్ఎస్ ఆరోపణ


తెలంగాణ ప్రజల పట్ల కాంగ్రెస్‌, బీజేపీలకు ఏమాత్రం పట్టింపులేదని ఆధారాలతో వివరిస్తున్నది. అందుకు 2014-19 (16వ లోక్‌సభ), 2019-2024 (17వ లోక్‌సభ)లో రాష్ట్రం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు లోక్‌సభలో అడిగిన ప్రశ్నలను ప్రజలు ముందు ఉంచుతున్నది. లోక్‌సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్‌ ఎంపీలు అడిగింది 1,271 ప్రశ్నలేనని, బీజేపీ ఎంపీలు కేవలం 190 ప్రశ్నలే అడిగి చేతులు దులుపుకున్నారని బీఆర్‌ఎస్‌ మండిపడుతున్నది. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రాన్ని నిలదీయడంతో ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శించింది బీఆర్‌ఎస్‌ పార్టీయేనని స్పష్టం చేస్తున్నది. రెండు సభల్లో బీఆర్‌ఎస్‌ 4,754 ప్రశ్నలు అడిగి, కేంద్రాన్ని నిలదీసిన ఉదంతాలను వివరిస్తున్నది.


బీఆర్ఎస్‌గా పేరు మార్చడంతో మైసన్ అయిందనే భావన


టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా పేరు మార్చడం వల్ల..  తెలంగాణలో పార్టీ బేస్ కోల్పోయిందని మన పార్టీ అనే భావన ప్రజల్లో తగ్గిపోయిందన్న అభిప్రాయంలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. అందుకే.. మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు .. మన తెలంగాణ - మన బీఆర్ఎస్ అనేలా ప్రచారాన్ని.. భావోద్వేగాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు.